Delhi High Court: ప్రాణవాయువును అడ్డుకుంటే ఉరి తీస్తాం!

25 Apr, 2021 13:54 IST|Sakshi

ఆక్సిజన్‌ సరఫరాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్పందన 

కరోనా సునామీలా  విరుచుకుపడుతోంది 

నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్రానికి ప్రశ్న

న్యూఢిల్లీ: రికార్డుస్థాయిలో కోవిడ్‌ మరణాలు సంభవిస్తుండడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పెరిగిపోతున్న కేసులతో కరోనా సునామీలాగా విరుచుకుపడుతోందని వ్యాఖ్యానించింది. రాజధానికి సరఫరా చేసే ఆక్సిజన్‌ను ఎవరైనా అడ్డుకుంటే ఉరి తీస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. రాజధానిలో పెరిగిపోతున్న ఆక్సిజన్‌ కొరతపై జస్టిస్‌ విపిన్‌ సింగ్, రేఖా పల్లిల ధర్మాసనం విచారణ జరిపింది.

‘ఇది సెకండ్‌ వేవ్‌ కాదు, సునామీ. మే మధ్యనాటికి కరోనాను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవుతున్నాం’ అని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం సరఫరా చేసే టాంకర్ల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకునే వారిని ఉపేక్షించమని, వారిని ఉరితీస్తామని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులెవరైనా ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకుంటే తమకు నివేదించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కొరత లేకుండా యత్నిస్తున్నాం 
కరోనా రోగులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా ఉండేందుకు ప్రాణవాయువును దిగుమతి చేసుకోవడం, సాధ్యమైనంత మేర ఉత్పత్తి పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెమతా కోర్టుకు వివరించారు.

చదవండి: ఢిల్లీలో మరో వారం లాక్‌డౌన్ పొడిగింపు

మరిన్ని వార్తలు