రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంటే కళ్లు మూసుకోం.. తమిళనాడు గవర్నర్‌ తీరు, కేంద్రంపై ఆగ్రహం

5 May, 2022 08:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్ విడుదల విషయంలో కేంద్రం, తమిళనాడు గవర్నర్‌ అనుసరిస్తున్న వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరరివాలన్ విడుదల విషయంలో ఈ నెల పదో తేదీ లోగా తేల్చాలని, లేదంటే అవసరమైన ఆదేశాలను తామే జారీ చేస్తామని తేల్చి చెప్పింది. 

ఇక ఈ విషయంలో తదుపరి వాదనలేవీ లేవని కనుక కేంద్రం భావిస్తే పేరరివాలన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, రాజ్యాంగ ధర్మాసనం, ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంగానే దీనిని భావిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. ఈ నెల 10లోగా ఏదో ఒక విషయం చెప్పాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది.

రాజీవ్‌గాంధీ హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు శాసనసభ ఆమోదించింది. అయితే, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేశారు. దీంతో పేరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని, కాబట్టి ఆయన నిర్ణయంతో సంబంధం లేకుండా తమను విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ పీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. తదుపరి వాదనలేవీ లేవని కేంద్రం కనుక స్పష్టంగా చెప్పేస్తే పేరరివాలన్ విడుదలపై ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. మెరిట్‌ల ఆధారంగా కేసును వాదించడానికి మీరు సిద్ధంగా లేనందున మేము అతనిని జైలు నుండి విడుదల చేయమని ఉత్తర్వు జారీ చేస్తామ. కేంద్రం ఆదేశానుసారం తమిళనాడు గవర్నర్‌ వ్యవహరిస్తే గనుక అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానికి మేము కళ్ళు మూసుకోలేము. అధికారానికి పరిమితులు ఉండొచ్చు. కానీ, రాజ్యాంగం మాత్రం ఆగిపోకూడదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

>
మరిన్ని వార్తలు