ఏకకాలంలో శీతాకాల, బడ్జెట్‌ సమావేశాలు

17 Nov, 2020 04:05 IST|Sakshi

కోవిడ్‌–19 నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలపై ప్రభుత్వం యోచన

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు, బడ్జెట్‌ సమావేశాలు ఈసారి ఒకేసారి జరిపే సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌–19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రెండింటిని వేర్వేరుగా కాకుండా ఒకే విడతలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, దీనిపై ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని పేర్కొన్నాయి. సాధారణంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఏటా నవంబర్‌ చివరి వారం లేదా డిసెంబర్‌ మొదటి వారంలో ప్రారంభమవుతాయి.

బడ్జెట్‌ సెషన్స్‌ కూడా జనవరి చివరి వారంలో మొదలవుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఏడాదికి మూడు పర్యాయాలు పార్లమెంట్‌ సమావేశాలు జరపడం సంప్రదాయమే తప్ప, తప్పనిసరి కాదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచార్య తెలిపారు. రెండు సమావేశాల మధ్య గడువు ఆరు నెలలు మించరాదని మాత్రమే రాజ్యాంగం చెబుతోందన్నారు. శీతాకాల, బడ్జెట్‌ సమావేశాలను కలిపి నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు కూడా కోవిడ్‌ మహమ్మారి కారణంగా ముందుగానే ముగియడం తెలిసిందే. అదేవిధంగా, కోవిడ్‌ సమయంలో మునుపెన్నడూ లేని విధంగా చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలతో వర్షాకాల సమావేశాలు జరిగాయి. కోవిడ్‌–19 నిబంధనలను పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ పలువురు సభ్యులు, సిబ్బంది కోవిడ్‌ బారిన పడటంతో సెప్టె్టంబర్‌ 14వ తేదీన మొదలైన ఈ  సమావేశాలను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే 8 రోజులు ముందుగానే ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు