మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు

29 Nov, 2021 15:42 IST|Sakshi
మహిళా ఎంపీలతో శశి థరూర్‌ సెల్ఫీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్‌ పార్టీ నేత శశి థరూర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మహిళా ఎంపీలపై సెక్సియెస్ట్‌ కామెంట్స్‌ చేశారంటూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఏం జరిగింది అంటే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ తన ట్విటర్‌లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్‌ చేశారు. ‘‘లోక్‌సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో విమర్శలు మూటగట్టుకుంటుంది. 

‘‘బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్‌ కామెంట్‌ చేయడం ఎంత వరకు సబబు. అంటే మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరీ ఇదేంటి సార్‌’’ అంటూ ఓ రేంజ్‌లో శశి థరూర్‌ని ట్రోల్‌ చేశారు నెటిజనులు. 
(చదవండి: ఐటీఐఆర్‌.. లేదంటే అదనపు ప్రోత్సాహకం )

సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్‌ కావడంతో శశి థరూర్‌ ట్విటర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. సారీ చెప్తూ మరో ట్వీట్‌ చేశారు శశి థరూర్‌. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్‌ చేయమని కోరారు.. నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అంటూ మరో ట్వీట్‌ చేశారు శశి థరూర్‌. 
(చదవండి: శశిథరూర్‌ ఇంగ్లీష్‌పై ఫన్నీ వీడియో.. నెక్స్ట్‌ ఇమ్రాన్‌ ప్లీజ్‌!)

ఈ సెల్ఫీలో శశి థరూర్‌తో పాటు టీఎంసీకి చెందిన నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్‌కి చెందిన జోతిమణి, తమిజాచి తంగపాండియా ఉన్నారు.

చదవండి: మోదీ కన్నీళ్లపై కాంగ్రెస్‌ ఎంపీ ఫన్నీ కౌంటర్‌

మరిన్ని వార్తలు