Covid-19: రెండేళ్లలోపే 25 కోట్లు దాటేశాయి..! 

10 Nov, 2021 07:53 IST|Sakshi

రెండేళ్లలోపే ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులివి 

మళ్లీ కొన్నిచోట్ల కరోనా విజృంభణ 

యూరప్‌ దేశాలే ప్రస్తుత హాట్‌స్పాట్‌లు  

దాదాపుగా 55 దేశాల్లో పెరుగుతున్న కేసులు  

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది.. బ్రిటన్‌ మాత్రల్ని కూడా మార్కెట్‌లోకి తెచ్చేసింది.. కోవిడ్‌–19 నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా కొన్ని దేశాలు కరోనా థర్డ్‌వేవ్, ఫోర్త్‌వేవ్‌తో అల్లాడిపోతున్నాయ్‌  వైరస్‌ బయల్పడిన రెండేళ్లలో 25 కోట్లకు కేసులు చేరుకొని ప్రపంచ దేశాల్లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి.  

రెండేళ్లలోపే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 25 కోట్లు దాటేసింది. అన్ని దేశాలు రవాణా ఆంక్షల్ని సడలిస్తున్న నేపథ్యంలో తాజాగా పలుచోట్ల కేసులు మళ్లీ పెరగడం ఆందోళన పుట్టిస్తోంది. రష్యా, యూరప్‌ దేశాల్లో కరోనా కేసులు ఈ మధ్య కాలంలో విజృంభిస్తున్నాయి. జాన్‌హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య దాదాపుగా 25.5 కోట్లకు చేరుకుంది. కోవిడ్‌ బాధితుల మరణాలు 50.05 లక్షలు దాటేశాయి.  

చైనాలోని వూహాన్‌లో 2019 డిసెంబర్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ వాయువేగంతో వ్యాప్తి చెంది రెండేళ్లు గడవకుండానే  25 కోట్ల మందికి సోకింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, గ్రీస్, జర్మనీ కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. రష్యాలో రోజుకి 35 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఉక్రెయిన్‌లో  24 గంట్లోనే 833 మంది మృత్యువాతపడ్డారు. అయితే తాజా కేసుల్లో అత్యధిక మందిలో లక్షణాలు లేకపోవడం, వైరస్‌ లోడు తక్కువగా ఉండడం, ఆస్పత్రి అవసరం లేకుండానే తగ్గిపోవడం కాస్త ఊరటనిస్తోంది.  

వ్యాక్సినే బ్రహ్మాస్త్రం 
కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌కి మించిన బ్రహ్మాస్త్రం లేదు. అయినా పలు దేశాల్లో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతూ ఉండటంతో కేసులు ఎగబాకుతున్నాయి. వరల్డ్‌ ఇన్‌ డేటా ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఒక్క డోస్‌ కూడా ఇవ్వలేదు.. ఒక డోసు తీసుకున్న వారు 310 కోట్లు ఉంటారు. అమెరికా, యూరప్‌  దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిరుపేద దేశాల్లో టీకా అందుబాటులో లేకపోవడంతో 5% కంటే తక్కువ మందే ఒక్క డోసు తీసుకున్నారు. 

కోవిడ్‌–19 టీకా తీసుకోకపోతే ఐసీయూలో చేరడం, లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 16 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఆస్ట్రేలియా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సింగపూర్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లో కనీసం ఒక్క టీకా డోసు తీసుకున్న వారు 70 శాతానికి పైగా ఉన్నారు.     – నేషనల్‌ డెస్క్, సాక్షి  

 ప్రభావం ఎలా ఉందంటే.. 
►55 దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. 
►ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు యూరప్‌ దేశాల నుంచే వస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 10 లక్షల కేసులు యూరప్‌లో నమోదయ్యాయి.  
►అమెరికా కరోనా కేసుల పట్టికలో టాప్‌లో  ఉంది. ఆ దేశంలో ప్రతీ అయిదు మందిలో ఒకరికి కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 4.65 కోట్ల కేసులు నమోదయ్యాయి.  
►మొదటి 5 కోట్ల కేసులు నమోదవడానికి ఏడాది సమయం పడితే అప్పట్నుంచి ప్రతీ మూడు నెలలకి 5 కోట్ల కేసులు నమోదవుతూ వస్తున్నాయి.  
►కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా కేసులు తగ్గకపోవడానికి డెల్టా వేరియెంట్‌ విజృంభణే కారణం  
►తూర్పు యూరప్‌లో అతి తక్కువగా వ్యాక్సినేషన్‌ జరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
►గత ఏప్రిల్‌ వరకు ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకి 8,26,000 కేసులు నమోదవుతే ప్రస్తుతం 4లక్షల కేసులు వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు