పాముకాటుకు గురైన మహిళ.. మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన గ్రామస్థులు

20 Sep, 2022 09:47 IST|Sakshi

రాయ్‌పూర్‌: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. 

‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్‌ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్‌ తీర్థరాజ్‌ అగర్వాల్‌.

ఇదీ చదవండి: షాకింగ్‌ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు

మరిన్ని వార్తలు