చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు

12 Jun, 2022 05:37 IST|Sakshi

మనోవర్తి కేసులో ముంబై హైకోర్టు

ముంబై: చదువుకున్నంత మాత్రాన మహిళలను ఉద్యోగం చేసి తీరాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని ముంబై హైకోర్టు పేర్కొంది. పని చేయాలా, ఇల్లు చక్కదిద్దుకోవడానికే పరిమితం కావాలా అన్నది పూర్తిగా ఆమె ఇష్టమేనని న్యాయమూర్తి జస్టిస్‌ భారతీ డాంగ్రే స్పష్టం చేశారు. ఓ విడాకుల కేసులో భార్యకు మనోవర్తి చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పెట్టుకున్న రివిజన్‌ పిటిషన్‌ను శుక్రవారం ఆమె విచారించారు.

డిగ్రీ చేసిన తన మాజీ భార్యకు సంపాదించుకునే సామర్థ్యముంది గనుక మనోవర్తి చెల్లించాలన్న ఆదేశాలు సరికాదన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చారు. ‘‘ఈ రోజు నేను న్యాయమూర్తిని. రేపు బహుశా ఇంట్లో కూర్చోవాల్సి రావచ్చు. న్యాయమూర్తిగా పని చేయగల సామర్థ్యముంది గనుక అలా ఊరికే ఉండొద్దని చెప్తారా మీరు?’’అని ప్రశ్నించారు. తన భార్యకు స్థిరమైన ఆదాయ వనరు ఉన్నా ఆ వాస్తవాన్ని దాచిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై వచ్చే వారం తదుపరి విచారణ జరగనునుంది.

మరిన్ని వార్తలు