పురిటినొప్పులతో విలవిల్లాడిన మహిళ.. కానిస్టేబుల్‌ చేసిన పనికి ఫిదా..

29 Jul, 2021 12:36 IST|Sakshi

లక్నో: ఒక మహిళా కానిస్టేబుల్‌ తన మానవత్వాన్ని చాటుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు అండగా నిలిచి, తల్లిబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి చేర్చింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాలాబాద్‌కు చెందిన 30 ఏళ్ల రేఖ తన భర్తతో కలిసి ఉంటుంది. కాగా, గర్భవతి అయినా రేఖ కొన్ని రోజులుగా పురిటినొప్పులతో బాధపడుతుంది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన తల్లితో కలిసి గత సోమవారం (జులై 26)న బస్సులో షాహజాన్‌పూర్‌కి బయలుదేరింది. బస్సులోని కుదుపుల కారణంగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, ఆమెకు నొప్పులు మరీ ఎక్కువకావడంతో బాధను తాళలేక విలవిల్లాడింది. 

ఈ క్రమంలో బింటూ పుష్కర్‌ అనే మహిళ కానిస్టేబుల్‌ అదే బస్సులో ప్రయాణిస్తుంది. అంబూలెన్స్‌ మాత్రం సమయానికి రాకపోవడంతో ఆమె రేఖ, ఆమె తల్లి ఆందోళనకు లోనయ్యారు. దీంతో బింటూ పుష్కర్‌ వారిద్దరికి ధైర్యం చెప్పింది. అంతటితో ఆగకుండా, రేఖ తల్లితో కలిసి చీరను అడ్డుగా పెట్టి ఆమెకు సపర్యలు చేసింది. కాసేపటి తర్వాత రేఖకు ఒక బాలిక జన్మించింది. తల్లిబిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ క్రమంలో.. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అంబూలెన్స్‌లో తల్లిబిడ్డలను దగ్గర్లోని ఒక మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో పుష్కర్‌, బస్సులోని మిగతా ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు.  ప్రస్తుతం.. ఈ సంఘటన కాస్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కష్టకాలంలో మహిళకు అండగా నిలిచినందుకు కానిస్టేబుల్‌ బింటూ పుష్కర్‌పై  నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు