ఆన్‌లైన్‌ డెలివరీ ఏజెంట్లతో జర జాగ్రత్త.. ఒంటరి మహిళతో అసభ్యకర ప్రవరన.. ఎక్కడంటే? 

2 Dec, 2022 15:26 IST|Sakshi

ఇటీవలే కొరియాకు చెందిన ఓ యూట్యూబర్‌తో కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. సరుకులు డెలివరీ చేసేందుకు ఓ కస్టమర్ట్‌ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్‌.. మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్‌ ఘటన ఖర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఖర్‌ పశ్చిమ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సబీనా ఆమె కుటుంబంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో​ సరుకుల డెలివరీ కోసం ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థను ఆశ్రయించింది. దీంతో, ఆన్‌లైన్‌ సంస్థకు చెందిన షాజాదే షేక్‌ సరుకులను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని డెలివరీ బాయ్‌ గమనించాడు. ఈ క్రమంలోనే సరుకుల డెలివరీ తర్వాత.. వీడియో తీయాలని చెప్పి ఫోన్‌లో వీడియో మోడ్‌ ఆన్‌చేశాడు. అనంతరం.. ఆమె చేయి పట్టుకుని అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. 

దీంతో, ఒక్కసారిగా షాకైన బాధితురాలు.. వెంటనే కిచెన్‌లో ఉన్న ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సాయంతో సెక్యూర్టీకి కాల్‌ చేసింది. వెంటనే స్పందించిన అక్కడికి వచ్చిన సెక్యూర్టీగార్డ్‌ అతడిని అడ్డుకున్నాడు. అనంతరం, అతడిలో చేతిలో ఉన్న ఫోన్‌ తీసుకుని బాధితురాలు వీడియోను డిలీట్‌ చేసింది. ఇక, తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌ వేదికగా ఆమె తెలిపింది. ఈ క్రమంలో సదరు డెలివరి సంస్థపై బాధితురాలు సీరియస్‌ కామెంట్స్‌ చేసింది. ఇలాంటి వారితో రోజు ఇంకెంత మంది మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారో అని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత, సదరు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

ఇక, ఘటనపై సదరు డెలివరీ సంస్థ స్పందించింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మేము ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటాము. స్థానిక చట్టాన్ని అమలు చేసే సంస్థలతో ఘటనపై సమగ్ర విచారణ జరిపించి..  విచారణలో మేము కూడా పాల్గొంటున్నాము. ఇలాంటి ప్రవర్తనను త్రీవంగా ఖండిస్తున్నాము. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు