Viral Video: రోడ్డుపై రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్‌ కూతురు.. క్రికెట్‌ బ్యాట్‌తో దుకాణాలపై దాడి

25 Oct, 2022 13:01 IST|Sakshi

లక్నో: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయి ప్రవర్తించింది. ఇంటి ముందు ఉన్న దుకాణాలపై దాడి చేసింది. పెద్ద కర్రతో అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  లక్నోలోని గోమతి నగర్‌ ప్రాంతంలో స్థానిక వ్యాపారులు దీపావళి సందర్భంగా ఓ కాలనీలోని రోడ్డు మీద పండగ సామాగ్రి అమ్ముకుంటున్నారు. అయితే తన ఇంటి ముందు దుకాణాలు పెట్టుకున్నారని ఓ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారులు అక్కడ షాప్‌లు పెట్టవద్దని, వెంటనే తొలగించాలని వారితో వాగ్వాదానికి దిగింది. 

పండగ వేళ దుకాణాలు పెట్టవద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా షాప్‌లు పెట్టి వస్తువులు అమ్ముకుంటున్నారని వారిపై చిర్రుబుర్రులాడింది. అంతటితో ఆగకుండా పట్టరాని కోపంతో క్రికెట్‌ బ్యాట్‌ తీసుకొచ్చి దుకాణాలపై తీవ్రంగా దాడి చేసింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మట్టి దీపాలు, కుండీలు, ఇతర వస్తువులను కర్రతో పగలకొట్టింది.
చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్‌ సీఎం.. ఎందుకంటే?

కాగా దాడికి పాల్పడిన యువతి మాజీ ఐఏఎస్‌ కూతురుగా గుర్తించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో  యువతిపై పోలీసులు చర్యలు చేపట్టారు. దుకాణాలు ధ్వంసం చేసినందుకు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆమెపై 427, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఒక మాజీ ఐఏఎస్ కూతురు అయి ఉండి ఇలా వీధి వ్యాపారులపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రతి ఏటా ఇక్కడే మార్కెట్ జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై దుకాణాదారుడు మాట్లాడుతూ.. ‘మేడమ్ ఉదయం వచ్చి మా దుకాణాలను తొలగించమని అడిగారు. మాకు కొంత సమయం ఇవ్వమని చెప్పాము. వస్తువులను వాహనంలో ఎక్కించుకొని మరో చోటుకు వెళ్తామని చెప్పాము. అయినా ఆమె వినలేదు. దీపాలంకరణ, ఇతర వస్తువలపై నీరు పోశారు. అంతటితో ఆగకుండా బ్యాట్‌ తీసుకొచ్చి స్టాళ్లను ధ్వంసం చేశారు.  అంతా పాడైపోయాయి. ఎవరూ ఆమెకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ’అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు