తల్లి ప్రేమ అంటే ఇదే కదా.. ప్రాణాలు తెగించి.. పులితో పోరాడి..

7 Sep, 2022 13:01 IST|Sakshi

భోపాల్‌: పులితో ప్రాణాలకు తెగించి పోరాడి కన్నకొడుకుని కాపాడుకుంది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ సమీపంలోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఒక పులి  రోహనియా గ్రామంలో టైగర్‌రిజర్వ్‌ వెలుపల తిరుగుతుందని సమాచారం. కానీ ఆ విషయం సదరు మహిళకు తెలియదు. ఆమె తన ఏడాది వయసున్న కొడుకుని తీసుకుని పొలానికి వెళ్లింది. పొలంలోని పొదలమాటున దాగి ఉంది పులి.

సదరు మహిళ పొలం పనులు చేస్తుండగా..ఒక్కసారిగా మాటేసిన పులి సదరు బాలుడిపై హఠాత్తుగా దాడి చేసింది. దీంతో ఆమె తన చేతిలో ఏ ఆయుధం లేకపోయినా.. ఆ పులితో ప్రాణాలకు తెగించి పోరాడింది. పులిచేసే ప్రతి దాడిని ఎదుర్కొంటూ...మరోవైపు అరుస్తూ చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో గ్రామస్తులంతా వచ్చి ఆ పులిని తరిమికొట్టారు.

ఈ ఘటనలో ఆ బాలుడికి తలకు తీవ్రగాయలవ్వగా, తల్లి శరీరమంతా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ తల్లికొడుకు లిద్దరు జబల్‌పూర్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని టైగర్‌ రిజర్వ్‌ మేనేజర్‌ భారతి తెలిపారు. 
 

మరిన్ని వార్తలు