బేబి ఆన్‌బోర్డు.. విమానంలో ప్రసవం

18 Mar, 2021 05:17 IST|Sakshi

తల్లీబిడ్డ క్షేమం

బెంగళూరు–జైపూర్‌ విమానంలో ఘటన

న్యూఢిల్లీ: విమానం గాల్లో ఎగురుతుండగానే ముద్దులొలికే పాప పుట్టింది. బెంగుళూరు నుంచి జైపూర్‌కి వచ్చిన విమానంలో అదనంగా మరో ప్రయాణికురాలు వచ్చి చేరింది. ఇండిగో విమానం 6ఇ–469 విమానం ప్రయాణిస్తుండగానే అందులో ఉన్న ఒక గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బంది అందులోనే ప్రయాణిస్తున్న డాక్టర్‌ సుబాహనా నజీర్‌ సహకారంతో ఆమెకి పురుడు పోశారు. ఆ మహిళ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని విమానయాన సంస్థ ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది.

మహిళ ప్రసవ వేదన పడుతుంగానే విమాన పైలెట్‌ ఈ విషయాన్ని జైపూర్‌ విమానాశ్రయానికి సమాచారం అందించారు. దీంతో విమానం దిగేసరికి అక్కడ అంబులెన్స్, వైద్యుడు సిద్ధంగా ఉన్నారు. జైపూర్‌ విమానాశ్రయం సిబ్బంది ఆ తల్లి, బిడ్డలకి స్వాగతం పలికారు. ఇండిగో విమాన సిబ్బందితో సహా అందరూ వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. డెలివరీకి సాయం చేసిన ఆ వైద్యుడికి థ్యాంక్స్‌ కార్డు ఇచ్చారు. బుధవారం ఉదయం 5.45 గంటలకి బెంగుళూరు నుంచి బయల్దేరిన విమానం ఉదయం 8 గంటలకి జైపూర్‌కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ నుంచి బెంగుళూరు వెళుతున్న ఇండిగో విమానంలో ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పుడు బాబు పుట్టిన వార్త వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు