మూడు నెలల్లో 76 మంది పిల్లల్ని....

19 Nov, 2020 11:34 IST|Sakshi

మహిళా కానిస్టేబుల్‌ సాహసం, నెటిజనులు ఫిదా

మూడు నెలల్లో 76 మంది పిల్లల్ని తల్లితండ్రుల ఒడికి చేర్చిన కానిస్టేబుల్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలిసీ తెలియక, క్షణికావేశంతోను, కుటుంబ సభ్యులు వేధింపులు తట్టుకోలేక చాలామంది పిల్లలు ఇంటినుంచి పారిపోతూ ఉంటారు. అలా  తప్పిపోయిన చిన్నారులను, బాలలను తిరిగి తమ ఇంటికి చేర్చిన ఒక మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో అటు ఉద్యోగరీత్యా ప్రోత్సాహకాలతోపాటు, విధి నిర్వహణలో ఒక మహిళగా తల్లి మనసు చాటుకున్నారంటూ నెటిజనుల ప్రశంసలుకూడా అందుకున్నారు. తప్పిపోయిన  చిన్నారులను, కాపాడినందుకు ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకున్నారు. 12 నెలల్లో 76 మంది పిల్లలను కనిపెట్టినందుకుగాను సీమా ధాకా ఔట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ అందుకున్నారు.  వారిలో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. దీంతో అసాధారణ్‌ కార్యా పురస్కర్  అవార్డుకు సీమాను ఎంపిక చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న 50లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను (వీరిలో కనీసం 8 సంవత్సరాల లోపు చిన్నారులండాలి)12 నెలలో వ్యవధిలో రక్షించే ఏ కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్‌కు  ప్రోత్సాహక పథకం కింద అవుట్-టర్న్ ప్రమోషన్‌ ఇవ్వనున్నట్టు పోలీసు విభాగం ఆగస్టు 7న ప్రకటించింది. దీంతో రికార్డుస్థాయిలో పిల్లలను కాపాడి ఈ పురస్కారాన్ని అందుకోనున్న మొదటి పోలీసుగా సీమా నిలిచారు. దీంతో పాటు ఇతర అదనపు ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాస్తవ ప్రకటించారు. కేవలం 3 నెలల్లో 56 మంది  పిల్లలను  కాపాడిన సీమాకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. కేవలం ఢిల్లీనుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ పిల్లలను రక్షించామని సీమా చెప్పారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బిహార్  నుంచి తదితరులను  కాపాడినట్టు తెలిపారు.

2018లో ఒక మహిళ తన ఏడేళ్ల కుమారుడి తప్పిపోయిన ఫిర్యాదు చేశారు.  ఆ తరువాత  ఆ మహిళ తన చిరునామాను, మొబైల్ నంబర్‌ను మార్చేశారు. దీంతో ఆమెను గుర్తించడం చాలా కష‍్ట మైందన్నారు. చివరకు 2020 అక్టోబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని తల్లి వద్దకు చేర్చినట్టువెల్లడించారు. అలాగే సవతి తండ్రి  హింస, వేధింపులను తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయిన ఒక బాలుడు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా లేడంటూ తన అనుభవాలను పంచుకున్నారు  సీమా. కాగా సీమా జూలై 3, 2006 న  ఢిల్లీలోపోలీసు ఉద్యోగంలో చేరారు. ఆమె 2014 లో పదోన్నతి పొంది హెడ్ కానిస్టేబుల్ అయ్యారు.  2012 వరకు అక్కడే  పనిచేసిన ఆమెను  2012 లో బయటి జిల్లాకు, అక్కడి నుంచి రోహిణికి, తరువాత బయటి-ఉత్తర ప్రాంతానికి బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు

మరిన్ని వార్తలు