7 నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ

29 Oct, 2022 16:28 IST|Sakshi

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణీ యువతి గత వారం బిడ్డకు జన్మనిచ్చినట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ ట్రామాకేర్‌ విభాగం వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఆ యువతి అచేతన స్థితిలోనే ఉందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి కళ్లు తెరిచి చూస్తోందని, కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు 10-15 శాతం అవకాశం ఉందని వెల్లడించారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భార్యాభర్తలు హెల్మెట్‌ ధరించలేదు. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్తకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో ఆయన కోలుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బూలంద్‌శహర్‌లో జరిగింది. తొలుత బాధితురాలికి బులంద్‌శహర్‌లోని అబ్దుల్లా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి ఏప్రిల్‌ 1న తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌కు మార్చారు. 

తలకు తీవ్ర గాయాలవగా మెదడులో ఎముక ఉండిపోయినట్ల వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు 5 రకాల న్యూరోసర్జికల్‌ ఆపరషన్లు నిర్వహించారు.  ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ‘ప్రమాదం జరిగిన సమయానికి ఆమె 40 రోజుల గర్భిణీ. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. నెలలు నిండిన ఆమెకు అక్టోబర్‌ 22న ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 2.5 కిలోలు ఉంది. తల్లి అచేతన స్థితిలో ఉండడం వల్ల బిడ్డకు పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం. ’ అని డాక్టర్లు తెలిపారు.

ఇదీ చదవండి: లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్‌.. బీజేపీ మనీలాండరింగ్‌ ఆరోపణ

మరిన్ని వార్తలు