నా జీవితంలో మర్చిపోలేని ఘటన..

26 Aug, 2020 09:16 IST|Sakshi
శిధిలాల నుంచి క్షేమంగా బయటపడిన మెహరున్నీసా(60)

60 ఏళ్ల మహిళ.. 26 గంటల పాటు శిధిలాల కింద

ముంబై: మహారాష్ట్రలో ఐదంతస్థుల భవనం కుప్పకూలి 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే నాలుగేళ్ల బాలుడు మహమ్మద్‌ నదీమ్‌ బతికి బయటపడ్డాడు. తాజాగా మరో మహిళ క్షేమంగా బయటపడింది. వివరాలు.. మెహరున్నీసా  అబ్దుల్ హమీద్ కాజీ(60) అనే మహిళ శిధిలాల కింద చిక్కుకుపోయింది. దాదాపు 26 గంటల తర్వాత మంగళవారం రాత్రి ఆమెను సహాయక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. కాంక్రీటు, ఉక్కు శిధిలాల కింద 26 గంటల పాటు బిక్కుబిక్కుమని గడిపింది మెహరున్నీసా. ఒక చిన్న రంధ్రం ద్వారా ఆమె తాను అక్కడ చిక్కుకున్నట్లు సహాయక సిబ్బందికి తెలియజేసింది. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. (చదవండి: నా రెండు చేతులూ పోయాయ‌నుకున్నా..)

అయితే అన్ని గంటల పాటు శిధిలాల కింద ఉండటం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బది పడటంతో సహాయక సిబ్బంది వెంటనే మెహరున్నీసాకు పోర్టబుల్‌ ఆక్సిజన్‌ మాస్క్‌ అమర్చారు. ఆమె బట్టలు, ముఖం, జుట్టు దుమ్ముకొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన తన జీవితంలో మర్చిపోలేనిదని.. పునర్జన్మ పొందినట్లు అనిపిస్తుంది అన్నారు మెహరున్నీసా. ప్రస్తుతం అధికారులు భవనం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా భవనంలో నివసించే ముస్తఫావ్‌ చాపేకర్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘2013 నుంచి నేను ఇక్కడ నివసిస్తున్నాను. భవన నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి ప్లాస్టర్లు ఊడిపోవడం జరుగుతూనే ఉంది. దీని గురించి బిల్డర్‌ని అడిగితే.. కట్టడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదన్నాడు’ అని తెలిపాడు.

చాపేకర్‌ బిల్డింగ్‌ కూలడానికి కొద్ది సేపటి ముందే బయకటకు పరుగెత్తాడు. అయితే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఏదో ఓ చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మంగళవారం మధ్యప్రదేశ్‌లో రెండంతస్థుల భవనం కుప్పకూలింది.  

మరిన్ని వార్తలు