ఇలాంటి భర్తతో వేగలేను: విడాకులు ఇప్పించండి!

22 Aug, 2020 17:41 IST|Sakshi

లక్నో: సాధారణంగా భర్త టార్చర్‌ పెడుతున్నాడనో, అత్తమామలు, ఆడపడుచుల ఆరళ్లు తట్టుకోలేకపోతున్నామనో వివాహితలు విడాకులు కోరిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ గృహిణి మాత్రం వింత కారణం చెప్పి.. భర్త నుంచి విడిపోవాలనుకుంటోంది. అతి ప్రేమతో వేగలేకపోతున్నానని, ఒక్కసారి కూడా తనతో గొడవపడని భర్తతో కాపురం చేయలేనంటూ షరియా కోర్టును ఆశ్రయించింది. సదరు మహిళ ప్రవర్తించిన తీరు మనతో పాటు మత పెద్దలను కూడా ఆశ్చర్యపరిచింది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. యూపీలోని సంభల్‌ జిల్లాకు చెందిన మహిళకు 18 నెలల క్రితం నిఖా జరిగింది. దంపతులు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. (ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?)

అయితే కొన్ని రోజుల క్రితం ఉన్నట్టుండి సదరు వివాహిత షరియా కోర్టును ఆశ్రయించడంతో భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయేమోనని అంతా భావించారు. కానీ మత పెద్దల ముందు ఆమె చెప్పిన కారణాలు విని అంతా నిర్ఘాంతపోయారు. ‘‘నా భర్త నాపై ఒక్కసారి కూడా అరవలేదు. ప్రతీ విషయంలోనూ నాకే వత్తాసు పలుకుతాడు. తప్పు చేసినా క్షమిస్తాడు. ఒక్కసారి కూడా కోపగించుకోడు. ఏడాదిన్నరగా ఇదే తంతు. తనతో సరదాకైనా గొడవ పడాలని ఉంటుంది. అందుకే ఏదో ఒక విషయంలో గోల చేస్తాను. అయినా తనే వెనక్కి తగ్గుతాడు. అంతేకాదు ఇంటి పనుల్లో కూడా నాకు సాయం చేస్తాడు. ఆయన ప్రేమ నాకు ఊపిరి సలపకుండా చేస్తోంది. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. 

ఈ క్రమంలో ఈ కారణానికే విడిపోవడం సరికాదని, మరే ఇతర ఇబ్బందులు ఉన్నా తమకు చెప్పాలని అడుగగా.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చింది. దాంతో ఈ విషయంలో తామేమీ చేయలేమని మత పెద్దలు చెప్పడంతో ఈ వ్యవహారం స్థానిక పంచాయతికి చేరింది. అక్కడ కూడా సదరు మహిళ ఇదే కారణం చెప్పడంతో.. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ హజ్బెండ్‌’గా ఉండటం కూడా తప్పేనా అంటూ ఆమె భర్త మొరపెట్టుకోవడంతో పంచాయతి కూడా ఈ విషయంపై ఎటూతేల్చలేక.. కుటుంబ సభ్యుల మధ్య సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అనుకుంటాం గానీ ఒక్కోసారి అతిప్రేమ కూడా ప్రమాదకరమే..! ఎదుటివారి మనసెరిగి ప్రవర్తించడం అందరికీ మంచిది! ఏదేమైనా చిన్న చిన్న తగాదాలు, సరాదాలు, సంతోషాలు, అలకలు ఉంటేనే జీవితం పరిపూర్ణంగా ఉంటుందంటున్నారు వీరి వ్యవహారం గురించి విన్నవాళ్లు? మరికొంత మంది మాత్రం ప్రేమ పేరిట స్వేచ్ఛను హరించేస్తే ఎవరూ ఎవరి ప్రేమను తట్టుకోలేరు అంటున్నారు? అంతే అంటారా?  

మరిన్ని వార్తలు