హవ్వా, నాన్‌ వెజ్‌ పిజ్జా ఇస్తావా? రూ.కోటి డిమాండ్‌

14 Mar, 2021 11:52 IST|Sakshi

కొందరు శాఖాహారులకు మాంసం వాసనే గిట్టదు. అలాంటిది ఏకంగా వారు తినేదాంట్లో మాంసం కలిపేస్తే ఊరుకుంటారా? ఛాన్సే లేదు. ఇదిగో ఇక్కడ చెప్పుకునే దీపాళి త్యాగి అనే మహిళ కూడా శుద్ధ శాఖాహారి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివాసముండే ఆమె గతేడాది హోలి పండగ రోజు ఆకలితో ఉన్న తన పిల్లలకోసం అమెరికన్‌ పిజ్జా రెస్టారెంట్‌ నుంచి వెజ్‌ పిజ్జాను ఆర్డర్‌ చేసింది. కానీ చెప్పిన సమయాని కన్నా అరగంట ఆలస్యంగా డెలివరీ తన ఇంటి ముందుకు వచ్చింది.

పోనీలేనని, తనకు తాను సర్ది చెప్పుకుని ఆ డెలివరీ బాక్స్‌ ఓపెన్‌ చేసి గబగబా తిన్నారు. ఈ క్రమంలో పిజ్జాలో మాసం ముక్కలు పంటికి తగులడంతో అది మాంసాహార పిజ్జా అని అర్థమైంది. దాన్ని క్షుణ్ణంగా చూస్తే పుట్టగొడుగుల స్థానంలో మాంసం ముక్కలు ఉన్నాయని స్పష్టమైంది. దీంతో ఖంగు తిన్న మహిళ సదరు రెస్టారెంట్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సంప్రదాయాలు, ఆచారాలు, మత విశ్వాసాలను పాటించే నన్నే మోసం చేస్తావా? అంటూ రెస్టారెంట్‌ను కోర్టుకు లాగింది. నాన్‌వెజ్‌ పిజ్జా ఇచ్చి చీట్‌ చేశారంటూ ఇందుకు తనకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందేనంటూ వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది.

అయితే దీనిపై ఆమె అదే ఏడాది మార్చి 26న కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయగా.. మేనేజర్‌ ఉచితంగా వెజ్‌ పిజ్జాను పంపుతానని ఆఫర్‌ చేసినట్లు తెలిపింది. కానీ ఇది అంత చిన్న విషయం కాదని, తన సంప్రదాయాలను దెబ్బతీయడమేనని పేర్కొంది. తనను మానసిక క్షోభకు గురి చేసినందుకుగానూ కోటి రూపాయలు చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించాలంటూ ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్‌ సదరు పిజ్జా సంస్థను ఆదేశించింది. అనంతరం దీనిపై ఈ నెల 17న విచారణ జరపనున్నట్లు తెలిపింది.

చదవండి: ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?!

మరిన్ని వార్తలు