గర్భిణిని నడిపించినందుకు.. మహిళా ఎస్సైపై వేటు

30 Mar, 2021 09:24 IST|Sakshi

ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు

భువనేశ్వర్‌/మయూర్‌భంజ్‌: నడిరోడ్డు మీద 8 నెలల నిండు గర్భిణిని నడిపించిన ఆరోపణ కింద స్టేషన్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టరు రీణా బక్సల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కప్తిపడా స్టేషన్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ ప్రధాన్‌కు ఈ స్టేషన్‌  బాధ్యతలు అదనంగా కేటాయిస్తూ మయూర్‌భంజ్‌ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.  సస్పెన్షన్‌ వ్యవధిలో మయూర్‌భంజ్‌ స్టేషన్‌  అధికారుల పర్యవేక్షణలో రీణా బక్సల్‌ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల తక్షణ అమలు కోసం ఆమె బాధ్యతలను స్టేషన్‌లో సహాయ సబ్‌ ఇన్‌స్పెక్టరు బి. డి. దాస్‌ మహాపాత్రోకు అప్పగించాలని పేర్కొన్నారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.

శరత్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం హెల్మెట్‌ తనిఖీలు నిర్వహించారు. గర్భిణి గురుబారి బిరూలి, భర్త బిక్రమ్‌ బిరూలితో కలిసి ఆరోగ్య పరీక్షల కోసం వైద్యుని దగ్గరకు బైక్‌ మీద బయల్దేరింది. నోటా పంచాయతీ నుంచి ఉదొలా వెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీ చేశారు. భర్త హెల్మెట్‌ ధరించినా భార్య ధరించనందున జరిమానా చెల్లించాలని అడ్డుకున్నారు. నగదు లేనందున ఆన్‌లైన్‌లో జరిమానా చెల్లించేందుకు బాధితులు అభ్యర్థించినప్పటికీ పోలీసులు పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీంతో గర్బిణి గురుబారి బిరూలిని నడి రోడ్డు మీద వదిలేసి భర్త బిక్రమ్‌ బిరూలిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఘటనా స్థలం నుంచి 3 కిలో మీటర్ల దూరం దాదాపు 4 గంటల సేపు కష్టపడి గర్భిణి పోలీసు స్టేషన్‌కు చేరి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ మేరకు సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని బాధిత దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ అమానుష సంఘటనపట్ల జిల్లా పోలీసు అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత స్టేషన్‌  అధికారిపై సస్పెన్షన్‌ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి!   

మరిన్ని వార్తలు