దేశం విడిచి వెళ్లమని బెదిరింపులు.. నెలకి రూ.1కోటి ఆఫర్‌: మహిళా కోచ్‌

4 Jan, 2023 11:35 IST|Sakshi

చండీగఢ్‌: హరియాణా క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన జూనియర్‌ మహిళా అథ్లెటిక్‌ కోచ్‌ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను చావుకు భయపడనని, సందీప్‌ సింగ్‌కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు నెలకి రూ.1 కోటి చొప్పున ఇస్తామని బేరమాడినట్లు వెల్లడించారు. 

‘నా నోరు మూయించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను చావుకు భయపడను. బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గను. నాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. నాకు నచ్చిన దేశానికి వెళ్లిపోతే నెలకి రూ.1 కోటి అందుతాయని ఆఫర్‌ చేశారు. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుని, వేరే దేశానికి వెళ్లమని నన్ను అడిగారు. నాకు తెలుసు ఆయన(సందీప్‌ సింగ్‌) మంత్రివర్గం నుంచి తొలగించబడతాడు, జైలుకు వెళతాడు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.’అని మహిళా కోచ్‌ తెలిపినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. అలాగే.. ఈ కేసును హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై మంగళవారం మాట్లాడారు సీఎం ఖట్టర్‌. క్రీడాశాఖ మంత్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు అంసబ్ధమైనవని, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషిగా మారడని స్పష్టం చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసుల రిపోర్ట్‌ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అథ్లెట్‌ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు