రాష్ట్రపతి ముర్ము ఆశీస్సుల కోసం ప్రయత్నించింది.. విషయం తెలియక సస్పెన్షన్‌కు గురైంది!

15 Jan, 2023 09:29 IST|Sakshi

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఓ మహిళా జూనియర్‌ ఇంజనీర్‌ అత్యుత్సాహం ప్రదర్శించింది. రాష్ట్రపతి సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి ఆమె పాదాలను తాకే ప్రయత్నం చేసింది. దీంతో, సదరు మహిళా ఇంజనీర్‌ సస్పెన్షన్‌కు గురైంది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. జనవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా జనవరి 4న రోహెత్‌లోని స్కౌట్‌ గైడ్‌ జంబోరీ ప్రారంభ కార్యక్రమానికి ముర్ము హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రత్యేక ఆర్మీ విమానం అక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా ప్రోటోకాల్‌ ప్రకారం అధికారులందరూ ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్నారు. ముర్ము కూడా వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

ఇంతలో అక్కడే ఉన్న పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మహిళా జూనియర్ ఇంజనీర్‌ అంబా సియోల్‌.. రాష్ట్రపతి ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించారు. అయితే, వెంటనే అప్రమత్తమైన రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ద్రౌపది ముర్ము ముందుకు సాగారు. కాగా,  రాష్ట్రపతి ప్రొటోకాల్‌ను అతిక్రమించినందుకు ఈ ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ క్రమంలో ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించిన అంబా సియోల్‌ను రాజస్థాన్‌ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు