భారత్‌ బంద్‌లో వీరేరి?

8 Dec, 2020 14:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైతు....అనగానే మనకు మదిలో నాగలి పట్టిన లేదా పొలానికి నీరు పట్టేందుకు కాల్వతీస్తున్న రైతన్న మెదలుతాడు. మరి పొలం దున్నే రైతమ్మ కనిపించదా? అంటే కనిపించదనే చెప్పాలి.  నాట్లు వేస్తూనో, నాట్లు కడుతూనో వ్యవసాయ కూలీలుగా మాత్రం మహిళలు కనిపిస్తారు. మగవాళ్లు మాత్రమే కష్టపడి వ్యవసాయం చేస్తారనే పాత కాలం నాటి మాటే మన మెదళ్లలో గూడుకట్టుకు పోయింది.

కాలక్రమంలో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో మన రైతులు ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాల బాట పట్టారు. దాంతో వారి భార్యలు, అక్కా చెల్లెళ్లు పొలాల్లో రైతులుగా, రైతు కూలీలుగా మారి పోయారు. ఈ క్రమంలో రైతన్నలకన్నా రైతమ్మలు ఎక్కువయ్యారు. దేశంలో వ్యవసాయ గణాంకాల ప్రకారం 73.2 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. వారిలో 12.8 శాతం మందికి మాత్రమే సొంతంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూములు కలిగిన మహిళలకు ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు, సబ్సిడీలు లభించక పోవడం విచిత్రం. వ్యవసాయం చేస్తోన్న ఎక్కువ మంది మహిళలు వారి భర్తల పేరిట గల భూముల్లో పని చేస్తున్నారు. (చదవండి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హౌజ్‌ అరెస్ట్‌)

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ జిల్లాల్లో మనకు మహిళా రైతులు ఎక్కువగా కనిపిస్తారు. వారంతా రాజ్‌బన్సీ, నామశుద్రాస్, కపాలీసీ, ఆదివాసీలు పిలిచే ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మహిళా రైతుల గురించి ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోవడం లేదు. రాజ్‌గంజ్‌ పట్టణంలో మహిళల పొలం పనులు తెల్లవారు జామున ఐదు గంటలకే ప్రారంభం అవుతుంది. వారు పొలం దున్నడం నుంచి విత్తనాలు చల్లడం, నీళ్లు పెట్టడం, ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకంతోపాటు మార్కెట్‌కు వెళ్లి పంటలను అమ్మే వరకు అన్ని విధులు వారే నిర్వహిస్తారు. పశువులు మేపడం, పాలు పిండడం అదనం. ఇక అందరి తల్లుల మాదిరి ఇంటి పనులు, పిల్లల పోషణ బాధ్యతలు వారే నిర్వహిస్తారు. రాత్రి పొద్దెక్కి నిద్రపోయే వరకు వారికి క్షణం తీరిక ఉండదు.  పొలం నుంచి ఇంటికి ఇంటి నుంచి పొలానికి తిరగడంలో వారి జీవితం గడచిపోతుంది.

అంతటిలాగే ఆ పట్టణంలో కూడా మగవారు, ఆడవారి మధ్య వ్యవసాయ వేతనాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. వ్యవసాయ పనులు చేసే మగ కూలీలకు రోజుకు 250 రూపాయలు, మహిళలకు రోజుకు 150 రూపాయలే చెల్లిస్తున్నారు. ఆ పట్టణంలోని ఎక్కువ మంది మహిళా రైతులు వితంతువులు కాగా, వారి వ్యవసాయ భూములు ఇప్పటికీ వారీ దివంగత భర్తల పేరుతోనే ఉన్నాయి. వారి పేరిట ఆ భూములను బదలాయించమంటూ అధికారులను వేడుకుంటున్నా, ఓట్ల కోసం వచ్చే నేతలకు మొర పెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.

కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మంగళవారం కొనసాగుతున్న భారత్‌ బంద్‌ ఆందోళనలో ఎక్కడా మహిళా రైతులు కనిపించడంలేదు. ఎప్పటిలాగే ఆందోళన కార్యక్రమాలను మగవారికి అప్పగించి మహిళా రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉండవచ్చు. రైతు నేతలతో చర్చోప చర్చలు జరపుతున్న రాజ్యాధికార నేతలు వ్యవసాయ మహిళల తల రాతలను ఇకనైనా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు