కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్‌!

8 Sep, 2020 19:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఇప్పటికీ భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టడంలో ఏ దేశ ప్రభుత్వ నాయకత్వం ప్రశంసనీయమైన ఫలితాలను సాధిస్తోంది ? ఏ దేశ నాయకత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చిత్తశుద్ధితో కషి చేస్తోంది? అన్న అంశం...పై గత రెండు, మూడు నెలలుగా మీడియా వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరగుతోంది. ఏ దేశాల్లో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉంది ? అందుకు కారణాలేమిటీ ? ఏ దేశాల్లో లాక్‌డౌన్‌లు ముందుగా లేదా సకాలంలో విధించారు? ఏ దేశాల ప్రజలు కరోనా కట్టడికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు ? అంశాలతోపాటు  ఏ దేశాల్లో జనాభా ఎంత ? జన సాంద్రత ఎంత ? దేశాల మధ్యనున్న జీడీపీ సారూప్యతలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని నిపుణులు అధ్యయనం చేయగా అనూహ్యంగా, ఆశ్చర్యంగా మగ నాయకత్వమున్న దేశాల్లో కంటే మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని తేలింది.  (మాల్స్‌ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?)

వాటిల్లో కూడా జెసిండా ఆర్నర్డ్‌ నాయకత్వంలోని న్యూజిలాండ్, త్సాయి ఇంగ్‌ వెన్‌ అధ్యక్షులుగా ఉన్న తైవాన్, ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని జర్మనీ దేశాలు కరోనా కట్టడిలో ముందుకు వెళుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఓ నిర్దిష్ట కాలం వరకు మహిళా నాయకత్వంలోని హాంకాంగ్‌లో 1,056 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో నలుగురు మరణించారు. దాదాపు అలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన మగ నాయకత్వంలోని సింగపూర్‌లో 28, 794 కేసులు నమోదుకాగా, 22 మంది మరణించారు. అలాగే మహిళా నాయకత్వంలోని నార్వేలో నిర్దిష్ట కాలానికి 8,257 మంది కరోనా బారిన పడగా, 233 మంది మరణించారు. అదే పురుష నాయకత్వంలోని ఐర్లాండ్‌లో అదే కాలానికి 24,400 కరోనా కేసులు నమోదుకాగా, 1,547 మంది మరణించారు. (తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి!)

అలాగే మహిళా నాయకత్వంలోని తైవాన్‌లో నిర్దిష్ట కాలానికి 440 కేసులు నమోదుకాగా, ఏడుగురు మరణించారు. అదే కాలానికి పురుష నాయకత్వంలోని దక్షిణ కొరియాలో 11,078 కరోనా కేసులు బయట పడగా, 263 మంది మరణించారు. అలాగే ఫ్రాన్స్, బ్రిటన్‌కన్నా జర్మనీ, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్‌ కన్నా మహిళా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌ మెరుగైన ఫలితాలను సాధించాయి. మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ప్రభుత్వ వాణి ప్రజలదాకా వెళుతోంది. ప్రజలు ప్రభుత్వ సూచనలను బాగా పాటిస్తున్నారు. లండన్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ రీడింగ్‌లో హెడ్‌ ఆఫ్‌ స్కూల్‌గా పనిచేస్తోన్న ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ ఉమా ఎస్‌. కంభంపాటి, యూనివర్శిటీ ఆఫ్‌ లివర్‌పూల్‌లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న సుప్రియ గరికపాటి సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపారు. (పారదర్శకంగా వ్యవహరించాం: జిన్‌పింగ్‌)


బ్రిటన్‌కన్నా లాక్‌డౌన్‌ను ప్రకటించడంలో న్యూజిలాండ్, జర్మనీ దేశాలు ముందున్నాయి. అందుకనే ఆ దేశాలు కరోనా కట్టడి విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. నాయకత్వంలో ఉన్న పురుషులతో పోలిస్తే నాయకత్వంలో ఉన్న స్త్రీలు రిస్క్‌ తీస్కోరన్నది చారిత్రక సత్యంగా చెబుతుంటారు. ఆర్థిక నష్టాలను పణంగా పెట్టి మహిళా నాయకులు రిస్క్‌ ఎలా తీసుకున్నారన్నది ఇక్కడ ప్రశ్న. ప్రజల ప్రాణాల విషయంలో వారు రిస్క్‌ తీసుకోదల్చుకోలేదన్నది ఇక్కడ సమాధానం. నాయకత్వంలో ఉన్న పురుషులు, ప్రజల ప్రాణాలకన్నా ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారుకనక, వారు ఆ విషయంలో రిస్క్‌ తీసుకోలేదు. పైగా నిర్లక్షంగా వ్యవహరించారు. ‘అదా ఓ చిన్న పాటి ఫ్లూ లేదా కొంచెం జలుబు’ అన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సొనారో, కరోనా వైరస్‌ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడానికి ఓ ఆస్ప్రతికి వెళ్లి ప్రతి రోగితో కరచాలనం చేసిన  బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌లు కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

మరిన్ని వార్తలు