వైరల్‌: ‘అందుకే కింద కూర్చోబెట్టారు’

10 Oct, 2020 16:04 IST|Sakshi

ఆమెను ఒక్కదాన్నే కింద కూర్చోబెట్టారు!

చెన్నై: అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుని, అంతరిక్షంలో ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగినప్పటికీ కులం పేరిట సాటి మనిషిని అవమానించే స్వభావాన్ని మానవ జాతి వీడలేకపోతోంది. ఆధిపత్య వర్గాలు, అణగదొక్కబడిన సమూహాలపై చెలాయిస్తున్న పెత్తనానికి అడ్డుకట్ట పడటం లేదు.  రాజకీయంగా చైతన్యవంతులైనప్పటికీ దళితులు, ముఖ్యంగా మహిళలపై వివక్ష ఏస్థాయిలో ఉంటుందో తెలిపే ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పంచాయతీ‌ సమావేశంలో గ్రామ ప్రెసిడెంట్‌ను కింద కూర్చోబెట్టిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. (చదవండి: ‘చిత్ర హింసలు.. ఐదేళ్లు నరకం చూశా’ )

ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. వివరాలు.. కడలూరు జిల్లాలోని తెర్‌కుత్తిట్టై గ్రామానికి చెందిన రాజేశ్వరి గత జనవరిలో పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలిచారు. ఆమె దళిత వర్గానికి చెందిన మహిళ. గ్రామంలో 500 కుటుంబాలు ఉండగా.. 100 కుటుంబాలు షెడ్యూల్డ్‌ కులానికి చెందినవి. మిగతా మొత్తం వన్నియార్‌ కులానికి చెందినవి. ఈ నేపథ్యంలో పంచాయతీ సమావేశాల్లో మిగతా సభ్యులంతా, కుర్చీలపై ఆసీనులైతే.. రాజేశ్వరిని మాత్రం కిందనే కూర్చొమనేవారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ వివక్షపూరిత చర్యకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారు. (హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్‌ ఫిర్యాదు)

ఈ విషయం గురించి రాజేశ్వరి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా కులాన్ని కారణంగా చూపి ఉపాధ్యక్షుడు నన్ను ఈ విధంగా కింద కూర్చోబెట్టారు. అంతేకాదు జెండా ఎగురవేసేందుకు కూడా నన్ను అనుమతించడు. వాళ్ల నాన్నతోనే ఆ కార్యక్రమం పూర్తి చేయిస్తాడు. నేను ఈ పదవికి ఎంపికైన నాటి నుంచి ఏడాది కాలంగా అగ్ర వర్ణ పెద్దలు చెప్పినట్లుగానే వింటున్నాను. అయినా వాళ్లు నన్ను అవమానిస్తూనే ఉన్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో దేశంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తమిళనాడులో, దళితులు వండిన ఆహారాన్ని తినేందుకు ఆధిపత్య వర్గాలు నిరాకరించడం, వాళ్ల ముందు చెప్పులు వేసుకుని నడిస్తే సహించకుండా అమానుష చర్యలకు పాల్పడటం వంటి దృశ్యాలు కెమెరాకు చిక్కిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు