‘రాత్రి వేళ ఒంటరిగా పోలీస్‌స్టేషన్లకు వెళ్లకండి’

24 Oct, 2021 06:35 IST|Sakshi

వారణాసి: మహిళలు చీకటి పడిన తర్వాత పోలీస్‌స్టేషన్లకు వెళ్లవద్దంటూ మాజీ గవర్నర్, బీజేపీ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య హెచ్చరించారు. బజార్దిహా ప్రాంతంలోని వాల్మీకిబస్తీలో శుక్రవారం మహిళలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే సమయంలో కుటుంబంలోని మగవారిని వెంట తీసుకెళ్లాలంటూ సూచించారు. ‘ఠాణాల్లో మహిళా పోలీసులు కూడా ఉంటారు. కానీ, సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత, చీకటి వేళ మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లవద్దు.

అవసరమైన పక్షంలో మరుసటి రోజు ఉదయం తోడుగా సోదరుడు/ భర్త/ తండ్రిని వెంట తీసుకెళ్లండి’అని చెప్పారు. మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన కృషితో పరిస్థితి మారిందన్నారు. కాగా, రాణి మౌర్య వ్యాఖ్యలపై బీఎస్‌పీకి చెందిన ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో మహిళలకు పోలీస్‌స్టేషన్లలో కూడా రక్షణ లేదన్న విషయం రాణి మౌర్య మాటలతో తేలిపోయిందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు