‘మేనిఫెస్టోలో నేను లేను.. నా విషయంలో హామీ ఇవ్వలేను’ ఎమ్మెల్యే రిప్లయ్‌

31 Jul, 2021 21:42 IST|Sakshi

అమృత్‌సర్‌: కొన్ని నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటినుంచే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అయితే ఈసారి అధికారమే లక్ష్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో కాంగ్రెస్‌కు గట్టిపోనిచ్చిన ఆప్‌ ఈసారి అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో అప్పుడే హామీల వర్షం మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రజలకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రధాన హామీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై ఆప్‌ ఎమ్మెల్యే చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘ఉచిత విద్యుత్‌ వద్దు.. నాకు ఎమ్మెల్యే రాఘవ్‌ కావాలి’ అని కామెంట్‌ చేసింది. ఈ కామెంట్‌ను చూసిన ఆ ఎమ్మెల్యే స్పందించి ‘నేను మేనిఫెస్టోలో లేను’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సంభాషణ ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

పంజాబ్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌ను చూసిన కృతి ఠాకూర్‌ స్పందిస్తూ ‘కరెంట్‌ వద్దు.. రాఘవ్‌ కావాలి’ అని కామెంట్‌ చేసింది. ఆ కామెంట్‌ ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించింది. ఈ కామెంట్‌ను చూసిన రాఘవ్‌ చద్దా స్పందించారు. ‘మేనిఫెస్టోలో నేను లేను.. ఉచిత విద్యుత్‌ ఉంది’ అని రిప్లయ్‌ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు ఓటేయండి. 24 గంటలు ఉచిత విద్యుత్‌ మీకు ఇస్తామని నేను హామీ ఇస్తున్నా. నా విషయంలో మాత్రం హామీ ఇవ్వలేను’ అంటూ రాఘవ్‌ కామెంట్‌ చేశారు. వీరి సంభాషణ ట్విటర్‌లో వైరలయ్యింది.

32 ఏళ్ల రాఘవ్‌ చద్దా ఢిల్లీలోని రాజేందర్‌నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన అతి చిన్న వయస్కుడు. ఆ ట్వీట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నాడు. ‘కేజ్రీవాల్‌ గ్యారంటీ’ అంటూ చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను రిఫర్‌ చేశారు. ఢిల్లీ జల్‌ బోర్డు అధ్యక్షుడిగా కూడా రాఘవ్‌ కొనసాగుతున్నారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం ఆప్‌కు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఎలాగైనా 55 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఆప్‌ వ్యూహం రచిస్తోంది.

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు