తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే!

సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 27 జిల్లాల్లో మహిళా ఓటరే న్యాయ నిర్ణేతలయ్యారు. పది జిల్లాల్లో పురుషాధిక్యం కొనసాగింది. ఒక కోటి 70 లక్షల మంది ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా తమ బాధ్యతను విస్మరించారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థానాలకు ఆరో తేదీన ఎన్నికలు జరిగాయి. గతంతో పోల్చితే ఈ సారి ఓటింగ్‌ శాతం కాస్త తగ్గింది. దీంతో గెలుపు ధీమా అభ్యర్థుల్లో ఉన్నా తెలియని టెన్షన్‌ తప్పడం లేదు.

ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఓట్ల వివరాలు, ఎవరెవరు ఏ మేరకు ఓటు హక్కు వినియోగించుకున్నారో అన్న సమగ్ర వివరాలను ఎన్నికల యంత్రాంగం శనివారం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ శాతం, జిల్లాల వారీగా శాతాలకు తగ్గ వివరాలను ఇప్పటికే ప్రకటించినా, తాజాగా నియోజకవర్గాల వారిగా పురుషులు, స్త్రీలు, ఇతరులు ఏ మేరకు తమ హక్కును వినియోగించుకున్నారు, ఏ మేరకు విస్మరించారో అన్న విషయాన్ని వివరించారు.  

మహిళలే అధికం.. 
రాష్ట్రంలో ఆరు కోట్ల 28 లక్షల 69 వేల 955 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3 కోట్ల 9 లక్షల 23 వే 651 మంది, స్త్రీలు 3 కోట్ల 19 లక్షల 39 వేల 112 మంది ఉన్నారు. మిగిలిన వారు ఇతరులు. ఇందులో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న వారు 4 కోట్ల 57 లక్షల 76 వేల 311 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2 కోట్ల 26 లక్షల 3 వేల 156, స్త్రీలు 2 కోట్ల 31 లక్షల 71 వేల 736 మంది ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు 5 లక్షల 68 వేల 550 మంది అధికంగా ఓట్లు వేశారు. సాధారణంగా పురుషులే అధికంగా ఓటు హక్కు ఇది వరకు వినియోగించుకునే వారి జాబితాలో ముందుండే వారు. అయితే, ఈ సారి పురుషుల్ని మించి మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రంలోని వేలూరు, తిరువణ్ణామలై, నామక్కల్, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్‌ వంటి పశ్చిమ పర్వత శ్రేణుల కూడిన జిల్లాల్లోని నియోజకవర్గాలనూ అధికంగా మహిళలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం విశేషం. కుగ్రామాలతో నిండిన పోలింగ్‌ కేంద్రాల్లోనూ అధికంగా మహిళలు ఓట్లు వేసి ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో మహిళలు అత్యధికంగా ఓటు వేశారు. పది జిల్లాల్లో మాత్రం పురుషులు ముందంజలో ఉన్నారు. ఇందులో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, కృష్ణగిరి, ధర్మపురి, విల్లుపురం వంటి ఉత్తర తమిళనాడు జిల్లాలు ఉన్నాయి.

ఇక, ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు దూరంగా ఉన్న వాళ్లు  కోటి 70 లక్షల 93 వేల 644 మంది ఉన్నారు. తాజా ఎన్నికల్లో మహిళలు అధికంగానే నియోజకవర్గాల్లో ఓటు వేసిన దృష్ట్యా, వారి నిర్ణయమే అభ్యర్థుల తలరాతగా మారనున్నాయి. ఫలితాల రోజున మహిళ ఓటర్లే న్యాయనిర్ణేతలు కాబోతున్నారు.
చదవండి: మరో వివాదంలో కమల్‌

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు