మహిళా రైతుల పరిస్థితి: ఆకాశంలో సగం అవకాశాల్లో శూన్యం 

8 Mar, 2021 08:12 IST|Sakshi

మన దేశంలో 54% మంది వ్యవసాయం ఆధార కుటుంబాలే. ఇందులో 80 శాతం వ్యవసాయ పనులు చేసే మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. మహిళలను, వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, సరైన వ్యవసాయ పద్ధతులు కాని, విధానాలను కాని రూపొందించక పోవటం వలన మహిళా రైతులు పడిన కష్టానికి సరిపడా ఫలితం దక్కటం లేదు. ముఖ్యంగా ఒంటరి మహిళల విషయానికి వచ్చే సరికి పరిస్థితి మరీ దారుణంగా వుంది.

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవసాయంలో శ్రమతో కూడిన చాలా పనులు మహిళలు చేస్తున్నారు. వరిలో నాట్లు వేసే దగ్గర నుంచి, మెట్ట పంటలలో విత్తనాలు వేయటం, కలుపు తీయటం వంటి చాలా పనుల వరకూ మహిళలు ఒంగి చేయటం మనం రోజూ చూస్తుంటాం. ఈ పనులు చూడటానికి సులభంగా కనిపించినప్పటికీ, శారీరకంగా ఎక్కువ  శ్రమ చేయాలి. ఈ పనులలో శ్రమ తగ్గటానికి సరిపడా పనిముట్లు లేకపోవటం చాలా పెద్ద సమస్య. వ్యవసాయంలో భారీ యాంత్రీకరణ మీదనే ఎక్కువ దృష్టి పెట్టటం వలన మహిళలు తమకున్న కొద్దిపాటి ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. అలా కాకుండా శ్రమను తగ్గించి పనిని సులభంగా చేసే పనిముట్లు చేయటంతో పాటు, మహిళలకు శిక్షణ ఇచ్చి శ్రమ సంఘాల వంటివి ఏర్పాటు చేస్తే ఉపయోగం వుంటుంది. 

రసాయనాల అవశేషాల బెడద
వ్యవసాయంలో పురుగుల నివారణకు, కలుపు నివారణకు వాడే రసాయనాలలో విష ప్రభావంతో పాటు హార్మోన్లు కలిగి వుంటాయి. సాధారణంగా మహిళలు, చిన్న పిల్లల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ వుండటం వలన ఈ రసాయనాల అవశేషాలు శరీరంలో నిలువ ఉండటానికి అవకాశం వుంటుంది. వీటికి తోడు హోర్మోనల్‌ ప్రభావం కూడా వుండటం వలన మహిళల పునరుత్పత్తి వ్యవస్థ, ఋతుచక్రంపై ప్రభావం పడుతుంది. ఈ రసాయనాల వినియోగం ఎక్కువ వున్న ప్రాంతాలలో చాలా మంది మహిళలకు గర్భసంచి తీసివేసిన వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కలుపు నివారణకు వాడుతున్న కొన్ని రసాయనాలు (గడ్డి మందు) అనేక విష ప్రభావాలు కలిగి వున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అనేక నివేదికలు తెలియచేస్తున్నాయి. అలాగే పత్తి విత్తనోత్పత్తిలో చిన్న వయసులో వున్న ఆడపిల్లలు ‘క్రాసింగ్‌’ పనులు చేస్తున్నప్పుడు మొక్కల మీద చల్లిన రసాయనాలలో చాలా వరకు చేతి వేళ్ళ లేత చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి విషప్రభావం చూపిస్తాయి. 

చదవండి: నగర యంత్రాంగంలో నారీమణుల ప్రత్యేక ముద్ర 

అలాగే, ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటల్లో రసాయనాలు చల్లిన వెంటనే కోసినప్పుడు కూడా ఇలాంటి విష ప్రభావాలు కనపడుతున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం తగ్గించుకోవటంతో పాటు వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ఇలాంటి నివేదికలు అనేకం వున్న నేప«థ్యంలో పొలంలో పని చేసే వారి మీద ప్రభావం చూపే అన్ని రకాల రసాయనాల మీద నియంత్రణ విధించాల్సిన అవసరం వుంది.

పౌష్టికాహార లోపం
ఆహార భద్రత కోసం అనేక పథకాలు ఉన్నప్పటికీ అవన్నీ కేవలం బియ్యం / గోధుమలు పెంపకం వరకే పరిమితం కావటం వలన పోషకాహార లోపాలు కనిపిస్తున్నాయి. శ్రమకు సరిపడా పోషకాహారం తీసుకోక పోవటం వలన ఆరోగ్యం బాగా దెబ్బ తింటోంది. ఈ సమస్యను నివారించటానికి ఇంటి ఆవరణలో, బడులలో, గ్రామస్థాయిలో కాయకూరల, కోళ్ళు, పశువుల పెంపకంపై అవగాహన కల్పించి, ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయం చేయటం వలన ఆదాయం పెరగటంతో పాటు పోషకాహార లోపాలను నివారించవచ్చు. 

వలసల భారం
కుటుంబంలో పురుషులు వలస పోవటం వలన ఇంటిపనులు, వ్యవసాయ పనులు అన్ని కూడా మహిళల మీదే భారం పడుతున్నాయి. అలాగే మద్యం, రసాయనాల ప్రభావం.. వంటి అనేక అనారోగ్య కారణాల వలన భర్త చనిపోతే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మహిళ మీద పడుతోంది. అలాగే, ఆస్తుల పంపిణీ విషయంలో మహిళల పట్ల వివక్ష వుండటం వలన న్యాయంగా వారికి రావలసిన భూములు కూడా వారి పేరు మీదకు రావటం లేదు. 

చాలా రాష్ట్రాలలో మహిళలకు వ్యవసాయ భూమి అందుబాటులోకి తేవటానికి, హక్కులు ఇవ్వటానికి చేసిన ప్రయత్నాలు మెరుగైన ఫలితాలు చూపిస్తున్నాయి. మహిళలకు భూమి హక్కులపై అవగాహన, న్యాయ సహాయం ఇవ్వటంతో పాటు కొన్ని (కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌..) రాష్ట్రాలలో వీరిని సంఘాలుగా ఏర్పాటు చేసి భూమి పంపకం చేయటం, కౌలుకు తీసుకోవటానికి సహాయం చేయటం ద్వారా వీరి జీవనోపాధులను బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు అన్ని రాష్ట్రాలలో చేయాల్సి వుంది.

ప్రస్తుతం ఉన్న లోపాలు సరిదిద్ది మహిళలకు రావాల్సిన హక్కులు కల్పించటంతో పాటు వివక్షను సరిచేసి, సరైన అవకాశాలు కల్పించ గలిగితేనే కుటుంబం అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధిలో మహిళలు తమ పాత్ర పోషించగలుగుతారు. మహిళల అభివృద్ధిలోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు వుందని గుర్తించి ఆ వైపుగా విధానాల రూపకల్పన, ప«థకాల రచన, ప్రయత్నాలు చేయటం ఎంతైనా అవసరం. 

80 శాతం పని.. 13 శాతం భూమి.. 
వ్యవసాయంలో 80 శాతం పనులను మహిళలు చేస్తున్నప్పటికీ భూమి హక్కు 13 శాతం మందికి మించి లేదు. నేషనల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌.సి.ఎ.ఇ.ఆర్‌.) సంస్థ 2018లో చేసిన ఒక సర్వే ప్రకారం వ్యవసాయ భూముల్లో 2 శాతం మాత్రమే మహిళల పేరు మీద వున్నాయి. ఉత్పత్తికి ఆధారమైన ముఖ్య వనరు అయిన భూమిపై హక్కు లేకపోవటంతో వ్యవసాయానికి సంబంధించిన రుణాలు, రాయితీలు వంటివి అన్ని భూమి హక్కు పత్రంతో ముడిపడి వుండటం వలన ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తున్నది. వీటికి తోడు, కొన్ని రాష్ట్రాలలో ధాన్యం సేకరణ, ఆదాయ భద్రత కింద ఇచ్చే అనేక ప«థకాలు భూమి హక్కు లేని మహిళలకు అందటం లేదు. అలాగే అనేక రాష్ట్రాల్లో కుటుంబ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు వుండాలని చట్టాలు వున్నాయి. ఇటీవలే దీని మీద సుప్రీంకోర్టు కూడా రూలింగ్‌ ఇవ్వటం జరిగింది. అయినా, సమస్య తీవ్రత తగ్గలేదు. 

మరిన్ని వార్తలు