మహిళల హక్కుల్ని వాయిదా వేయలేం

23 Sep, 2021 06:00 IST|Sakshi

ఈ ఏడాది నుంచే ఎన్డీయే పరీక్షలకు మహిళలను అనుమతించాలి

వచ్చే ఏడాదికి వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించడాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కులను నిరాకరించాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. వారికి ఎన్డీయేలో ప్రవేశం కల్పించడం మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. 2022 మే నాటికి ఎన్డీయే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, మహిళలను అనుమతిస్తామని కేంద్రం చెప్పగా, న్యాయస్థానం అంగీకరించలేదు. తాము ఇదివరకే ఇచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ ఏడాది నవంబర్‌లోనే వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది.

అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తుంటాయని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఎన్డీయేలో మహిళలను చేర్చుకొనేందుకు ఇక ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో యూపీఎస్సీ, రక్షణ శాఖ కలిసి పని చేయాలని పేర్కొంది. ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల కోసం సమగ్రమైన కరిక్యులమ్‌ రూపొందించాలని, ఇందుకోసం రక్షణ దళాల ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్డీయేలో మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డ్‌ ఆఫ్‌ ఆఫీసర్ల సమావేశం నిర్వహించాలని తెలిపింది. ఎన్డీయేలో మహిళలకు ప్రవేశం నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ న్యాయవాది కుశ్‌ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. నవంబర్‌ 14న జరిగే పరీక్షకు మహిళలను అనుమతించలేమని, అందుకు సమయం సరిపోదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం బదులిచి్చంది. ఎన్డీయే ప్రవేశ పరీక్ష కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపర్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు