లసల్గావ్‌ మార్కెట్‌.. ఆనియన్‌ సీలింగ్‌ను బ్రేక్‌ చేసిన కార్యశాలి ఆమె!

9 Jun, 2021 15:28 IST|Sakshi
వెలాన్ని దక్కించుకున్న మహిళలు

లసల్గావ్‌.. అసియాలోనే అతి పెద్ద ఆనియన్‌ మార్కెట్‌. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సీజన్‌లో అక్కడ రోజూ ఉల్లిపాయల వేలం జరుగుతుంది. వ్యాపారులు మగవాళ్లే, దళారులు మగవాళ్లే, రైతులూ మగవాళ్లే. ఆడవాళ్లను ఆ దరిదాపుల్లోకి రానివ్వరు. అలాంటిది తొలిసారి.. ‘నా పాట...’ అంటూ ఒక మహిళ గొంతు వినిపించింది. అంతా తల తిప్పి చూశారు. ‘నా పేరు సాధన.. నా పాట ..’ అంటూ ఆమె వేలంలోకి దిగారు. అయితే మగవాళ్లంతా ఆ వేలాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం సాధన వైపు నిలబడింది. సాధనకు వేలం సమకూరింది. గ్లాస్‌ కన్నా గట్టిదైన ఆ ఆనియన్‌ సీలింగ్‌ను బ్రేక్‌ చేసిన కార్యశాలిగా సాధనా యాదవ్‌ వార్తల్లోకి వచ్చారు.

లసల్గావ్‌ ఉల్లి మార్కెట్‌లో శుక్రవారం హటాత్తుగా ఉల్లిపాయల వేలంపాట ఆగిపోయింది. ‘‘మేము పాడం’’ అని వ్యాపారులు పక్కకు వెళ్లిపోయారు. వాళ్లతోపాటు దళారీలు, వాళ్లతోపాటు కొద్దిమంది రైతులు! ‘ఆడవాళ్లను వేలంలోకి ఎలా రానిస్తారు?’ అని వాళ్ల అభ్యంతరం. అయితే ఆ మాటను వారు నేరుగా అనలేదు. ‘వేలానికి వచ్చిన ఆ ఆడ మనిషికి  కమిటీలో సభ్యత్వం లేదు. తనను వెళ్లిపొమ్మనండి’ అన్నారు. వాళ్లన్న ఆ ఆడ మనిషి సాధనా జాదవ్‌. వాళ్లన్న ఆ కమిటీ ఏపీఎంసీ. అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ. సాధన అనే ఆ మహిళకు ఎపీఎంసీలో సభ్యత్వం లేని మాట నిజమే. అయితే ఉండాలన్న నిబంధన లేదు. సాధన అదే మాట అన్నారు. ‘‘వేలానికి ఎవరొచ్చినా, రాకున్నా మాకు అనవసరం. మేము పాటలోకి దిగుతున్నాం’’ అని చెప్పారు.

లసల్గావ్‌ వేలంలో టన్నుల కొద్దీ ఉల్లిపాయల్ని కొనేసి తను వ్యాపారం చేసుకోడానికి సాధన అక్కడికి రాలేదు. ‘కృషి’ అనే వ్యవసాయ ఉత్పత్తుల మహిళా సహకార సంఘం తరఫున వచ్చారు. ఆమె వెనుక ‘కృషి’ ఉంది. ‘కృషి’ వెనుక నాఫెడ్‌ ఉంది. (నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా). ఎవరున్నా వెనక్కి వెళ్లాల్సిందే అని సాధనను, ఆమె వెంట ఉన్న మరొక మహిళను అక్కడి నుంచి తరిమేసినంత పని చేశారు. అయితే వేలంలో పాల్గొనడానికి సాధనకు అధికారికమైన అడ్డంకులేమీ లేవు. పాటకు వచ్చిన పురుషులు వచ్చారు. పాట సాగింది. సాధనకు పాట దక్కింది.  
∙∙ 
గ్లాస్‌ సీలింగ్‌ అంటుంటాం కానీ.. లసల్గావ్‌ ఆనియన్‌ సీలింగ్‌ మహా దృఢమైనది. మగాళ్లంతా జట్టు కట్టినట్లుగా ఆడవాళ్లను వేలంలోకి రానివ్వరు. తక్కువకు పాడి ఎక్కువకు అమ్మేసుకోవాలని అంతా ఒకమాటపై ఉండే ఆ వేలం వలయంలో ఉండేదంతా పురుషులే. మహిళా రైతులు ఉన్నా వారి తరఫున పురుషులనే వేలంలో పాడనిస్తారు. అయితే గత గురువారం నుంచి ‘నాఫెడ్‌’ తరఫున ‘కృషి’ సంస్థ డైరెక్టర్‌ అయిన సాధన నేరుగా తనే వేలానికి వస్తున్నారు. పైగా నాఫెడ్‌కు కృషి నోడల్‌ ఏజెన్సీ. ‘అయితే మాత్రం..’ అని వేలానికి వచ్చిన పురుషులు గురువారం ఒక్కరోజే కాదు, శుక్రవారం, శనివారం కూడా సాధన వేలంలో పాల్గొన్నారు.

వేలం ఎవరి ఆధ్వర్యంలో అయితే జరిగిందో ఆ ఎపీఎంసీకి ఛైర్‌పర్సన్‌ కూడా మహిళే. సువర్ణ జగ్దీప్‌. మహిళ కాబట్టి మహిళకు మద్దతు ఇవ్వడం కాదు.. సాధన అవసరమైన పత్రాలన్నీ చూపించారు. ఇక పురుషులు సాకులు చూపడానికి దారి లేకపోయింది. లసల్గావ్‌ మార్కెట్‌ కమిటీ పరిధిలోని 321 మంది కమీషన్‌ ఏజెంట్‌లలో 107 మంది, కమిటీలో పేరు నమోదు చేయించుకున్న 335 మంది వ్యాపారులలో 71 మంది మహిళలు ఉన్నప్పటికీ ఏనాడూ అక్కడి వారు మహిళల్ని వేలం లోకి రానివ్వలేదు. సాధననా యాదవ్‌ వల్ల మొదటిసారి ఆ ఆనియన్‌ సీలింగ్‌ బ్రేక్‌ అయింది. ఈ ఘటనతో అసలు లసల్గావ్‌ వేలంలో ఇంతకాలం ఏం జరుగుతున్నదీ మాధునీ ఖడ్సే అనే మహిళా రైతు ముందుకు వచ్చి చెప్పగలిగారు. 


సాధనా యదవ్‌
వేలంపాటలో మహిళా రైతులు, మహిళా వర్తకుల మాట చెల్లుబాటు కాకుండా ఉండేందుకు అవసరమై అన్ని అవాంతరాలను, అడ్డంకులను, అసౌకర్యాలను వేలంలో పాల్గొనడానికి వచ్చే పురుషులు సృష్టిస్తూ ఉంటారని మాధురి చెప్పారు. సాధనా యాదవ్‌ చొరవతో మొట్టమొదటి సారి మహిళల మాట నెగ్గిందని అన్నారు. తక్కువకు వేలాన్ని ముగించనివ్వకుండా, న్యాయంగా పాడి రైతుకు లాభం చేకూరుస్తారు కనుకనే మహిళలను లోపలికి రానివ్వరని కూడా ఆమె చెప్పారు. ‘‘ఏపీఎంసీ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కయి ఈ పని చేస్తారు. ఇదేంటని ప్రశ్నించిన రైతు పంట వేలం వరకు రాకుండా వృథా కావలసిందే. మహిళలు ఇలాంటివి సాగనివ్వరు కనుకనే వాళ్లను దూరంగా ఉంచుతారు’’ అని అంటున్న సాధనా యాదవ్‌.. ‘‘ఇది ఒకరోజుతో ముగిసే పోరాటం కాదు. రైతుల తరఫున నిరంతరం ఒకరు ఉండాలి. మా సొసైటీ ఉంటుంది’’ అని ఆమె స్పష్టంగా చెబుతున్నారు.

చదవండి: భారత్‌ బయోటెక్‌’కు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు