మొక్కలు కూడా యుద్ధం చేస్తాయా..?

2 Mar, 2022 23:46 IST|Sakshi

ఒడిశా: మొక్కలు సాధారణంగా ఎవరినీ నొంపించవనే మనకు తెలుసు. కానీ వుడ్ సోరెల్ అని పిలవబడే ఓ మొక్క ఉంది. అయితే దానిని ఎవరైనా ముట్టుకుంటే దానికి కోపం వస్తుంది. ఎంతలా అంటే దాని దగ్గరున్న ఆయుదాలతో ఆపకుండా యుద్ధం చేస్తుంది. అదేంటి మొక్క యుద్ధం చేయడమేంటనుకుంటున్నారా..? ఇది నిజమే ఆ మొక్కను ఎవరైనా ముట్టుకుంటే వారి బారి నుంచి కాపాడుకోవడానికి మిస్సైళ్లను పేల్చుతుంది.

మిస్సైల్స్ అంటే ఎలాంటి బాంబులనో కాదు. ఆ మొక్క విత్తనాలనే బాంబుల్లా విసిరేస్తుందన్నమాట. వుడ్ సోరెల్ కాయలు చూడటానికి అచ్చం బెండకాయల్లా ఉంటాయి. ఎవరైనా దానిని తాకిన వెంటనే ఆపకుండా వరుసగా విత్తనాలను విసురుతుంది. ఒక్కటి రెండో కాదు కాసేపు అలా వాటిని వదులుతూనే ఉంటుంది. మిస్సైళ్ నుంచి బాంబులను వదిలినట్టుగా ఈ మొక్క విత్తనాలను వదలుతుంది. ఇలా దాదాపు నాలుగు మీటర్ల వరకు విత్తనాలను విసరగలిగే శక్తి ఈ వుడ్ సోరెల్ మొక్కలకు  ఉంటుంది. ఒత్తిడితో పాటు దానికున్న శక్తి వల్ల అది విత్తనాలను విసరగలుగుతుంది.

అయితే ఈ విత్తనాలు తగిలితే మనుషులకు పెద్దగా నొప్పి లేకపోవచ్చు కానీ చిన్నచిన్న కీటకాలకు తగిలితే వాటికి  మాత్రం నొప్పి పుడుతుంది. తాజాగా ఈ మొక్కకు సంబంధించిన ఓ వీడియోను ఒడిశాకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇక ఈ వుడ్ సోరెల్ మొక్క బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మినహా ఈ మొక్క ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటుందని తెలుస్తుంది. మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో వుడ్ సోరెల్ కనిపిస్తుందని సమాచారం.

మరిన్ని వార్తలు