Work From Home: బంధం తగ్గుతోంది..

26 Sep, 2021 08:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వయం తగ్గుతోందని ‘2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదిక’ అనే పరిశోధనలో తేలింది. ఓ సీ ట్యానర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.

దీని ప్రకారం ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు తమ బాస్‌తో సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు లేకపోవడం, ఉద్యోగులు– ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడటం దీనికి కారణాలని పేర్కొంది. ఈ సమస్యలు కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైనట్లు నివేదిక తెలిపింది. 

అంతర్జాతీయంగా పరిశోధన..
ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 38 వేల మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు, హెచ్‌ఆర్‌ విభాగానికి చెందినవారు, ఎగ్జిక్యూటివ్‌ అధికారుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ పరిశోధన వెలువడింది. ఇందులో భారత్‌ నుంచి 5,500 మంది పాల్గొన్నారు. వీటన్నింటిని ఓసీ ట్యానర్‌ ఇన్‌స్టిట్యూట్‌ క్రోడీకరించి 2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదికను వెలువరించింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ పరిశోధన మరోమారు స్పష్టం చేసిందని ఇన్‌స్టిట్యూట్‌ ఉపాధ్యక్షుడు గ్యారీ బెక్‌స్ట్రాండ్‌ చెప్పారు. 

ప్రోత్సాహం లేదు..
57 శాతం మంది ఉద్యోగులు తమ బాస్‌ల నుంచి ప్రోత్సాహాన్ని పొందడం లేదని పరిశోధనలో వెల్లడించారు. 62 శాతం మంది పై అధికారులు విజయం సాధించడం ఎలాగో చెబుతుండగా, 52 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగుల విజయాల గురించి ఇతరులకు వివరిస్తున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంచడంలో ఉన్నతాధికారులు విఫలమైతే పరిస్థితులు మరింత దిగజారతాయని పరిశోధన పేర్కొంది.

ఉద్యోగులను పట్టించుకోకపోతే, ఉద్యోగులు కూడా తమ సంస్థ గురించి పట్టించుకోవడం మానేస్తారని తెలిపింది. సంస్థలోని ముఖ్యమైన సందర్భాలను కలసి జరుపుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా వారు బాగా పని చేస్తారని నివేదిక స్పష్టం చేసింది.

కీలకాంశాలు..
పరిశోధనలో పాల్గొన్న 61 శాతం మంది ఉద్యోగులు తమకు నూతన పరిచయాలు కార్యాలయాల్లోనే అవుతాయని చెప్పారు. సామాజికంగా ఇతరులతో కలసి పని చేస్తే తమలోని ఉత్తమ నైపుణ్యాన్ని బయటకు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. మరో 45 శాతం మంది ఉద్యోగులు.. గతేడాది నుంచి ఆఫీస్‌ వర్క్‌కు సంబంధించిన దైనందిన సమన్వయ కార్యక్రమాలు బాగా పడిపోయాయని చెప్పారు.

57 శాతం మంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా వరకు తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. పని ప్రదేశంతో కనెక్షన్‌ తెగిపోయాక తమ పనితీరు 90శాతం వరకూ పడిపోయిందని కొందరు ఉద్యోగులు వెల్లడించారు. దీంతో పాటు పని వల్ల నీరసపడిపోవడం (బర్న్‌ఔట్‌) బాగా పెరిగిందని వెల్లడించారు. 

చదవండి: కోవిడ్‌ పోరులో కొత్త ఆశలు

మరిన్ని వార్తలు