వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఒత్తిడి

14 Oct, 2020 21:07 IST|Sakshi

41 శాతం మంది ఉద్యోగుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం

పెరిగిన పనిభారం, తెలియని ఆందోళనతో సతమతం

వర్కింగ్‌ మదర్స్‌ పరిస్థితి మరీ దారుణం

లింక్డెన్‌ ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ సర్వేలో వెల్లడి

 సాక్షి, అమరావతి: కోవిడ్‌-19తో అనివార్యంగా మారిన వర్క్‌ ఫ్రం హోం (ఇంటి నుంచి పనిచేయడం) ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్పొరేట్‌ కంపెనీలతోపాటు చిన్నా, పెద్ద కంపెనీలన్నీ దాదాపు వర్క్‌ ఫ్రం హోంను సాధారణ పనివిధానంగా మార్చేశాయి. దీంతో అనేక కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు లింక్డెన్‌ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ సర్వేలో తేలింది. ఈ సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న 16,199 మంది ఉద్యోగుల్ని ఎంపికచేసి ఈ సర్వే చేశారు. అందులో వెల్లడైన అంశాలు ఏమిటంటే..
 

  • మొదట్లో వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఉద్యోగులు ఆనందించినా నెమ్మదిగా అది ఆవిరైపోయింది. చాలామందిలో మానసిక సమస్యలు మొదలయ్యాయి. 
  • భయం కలిగించే ఆరోగ్య పరిణామాలు, అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు, తెలియని భయం ఏర్పడ్డాయి. ఇంట్లోనే ఒక ప్రదేశానికి పరిమితమై బయటకు వెళ్లకుండా రోజుల తరబడి అక్కడే ఉండడంవల్ల పనిచేయడం ఇబ్బందికరంగా మారినట్లు గుర్తించారు.
  • ప్రతి ఐదుగురిలో ఇద్దరు.. అంటే 41 శాతం మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. కంపెనీకి 24 గంటలు అందుబాటులో ఉండాల్సి రావడం.. అర్థరాత్రిళ్లు, వారాంతాలు కూడా పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొనడాన్ని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు గుర్తించారు.
  • పని గంటలు పెరిగిపోవడం, నిరంతరాయంగా జరుగుతున్న ఆన్‌లైన్‌ మీటింగ్‌లతో ఉద్యోగులపై భారం పెరిగిపోయింది. 
  • ప్రతి ముగ్గురిలో ఒకరు తమ వ్యక్తిగత వృద్ధి, జీవితం దెబ్బతిందని భావిస్తున్నారు. 
  • వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య ఉండే రేఖను ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ చెరిపేసిందని బాధపడుతున్నారు. 
  • 50 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఒంటరితనంగా ఫీలవుతున్నారు. 
  • ఇక వర్కింగ్‌ మదర్స్‌ పరిస్థితి మరింత దారుణంగా తయారైనట్లు ఈ సర్వేలో తేలింది. ఇంటి పని, వంట పని, పిల్లల బాగోగులతోపాటు ఇంటి నుంచి ఉద్యోగం చేయాల్సి రావడం వారిపై అపరిమితమైన భారాన్ని మోపింది. 
  • ప్రతి ముగ్గురు వర్కింగ్‌ మదర్స్‌లో ఇద్దరు తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. కుటుంబ బాధ్యతలు మొత్తం వాళ్లపైనే పడ్డాయి.
  • ఇంట్లో పిల్లలు ఉండడంవల్ల ఆఫీసు పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నట్లు 36 శాతం మంది వర్కింగ్‌ మదర్స్‌ తెలిపారు. 
  • కేవలం 23 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వర్క్‌ ఫ్రం హోమ్‌లో అనువైన పని గంటలు, అవసరమైన మద్దతు పొందినట్లు తేలింది.
మరిన్ని వార్తలు