మూసధోరణికి తెర

12 Nov, 2022 05:09 IST|Sakshi

పెట్టుబడులకు నమ్మకమైన దేశంగా మారిన భారత్‌: మోదీ

బెంగళూరులో వందేభారత్‌ రైలు ప్రారంభం, కెంపేగౌడ విగ్రహావిష్కరణ

బెంగళూరు: దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలంటే భౌతిక, సామాజికపరమైన మౌలిక సదుపాయాలను రెండింటినీ బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో భారత్‌ సాధిస్తున్న అద్భుతాలను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు.

మేడ్‌ ఇన్‌ ఇండియా, 5జీ టెక్నాలజీ 2014కు ముందు ఊహకందని విషయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వాలు పాత ఆలోచనా ధోరణిని పట్టుకొని వేలాడాయని, దేశ ఆకాంక్షల్లో వేగాన్ని విలాసంగా, గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని రిస్క్‌గా భావించాయని విమర్శించారు. ఈ అభిప్రాయాన్ని తమ ప్రభుత్వం మార్చేసిందన్నారు.

స్టార్టప్‌ల హబ్‌గా భారత్‌  
పెట్టుబడులకు  భారత్‌ ఒక నమ్మకమైన దేశంగా మారిందని మోదీ ఉద్ఘాటించారు. ‘‘కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మూడేళ్లలో కర్ణాటక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎఫ్‌డీఐ రాబట్టడంలో గతేడాది తొలి స్థానంలో నిలిచింది. ఐటీ, రక్షణ తయారీ, స్పేస్‌ టెక్నాలజీ, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగాల్లో దూసుకెళ్తోందని కొనియాడారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వమే కర్ణాటక బలం అని స్టార్టప్‌ అంటే కేవలం ఒక కంపెనీ కాదని, కొత్తగా ఆలోచించడానికి, సాధించడానికి భావోద్వేగ అంశమని వివరించారు.

విమానాశ్రయ టెర్మినల్‌ ప్రారంభం
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నగర వ్యవస్థాపకుడు నాదప్రభు కెంపేగౌడ 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. విగ్రహం బరువు 218 టన్నులు. ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్‌ గ్రహీత రామ్‌వాంజీ సుతార్‌ ఈ విగ్రహాన్ని డిజైన్‌ చేశారు. విమానాశ్రయంలో .5,000 కోట్ల వ్యయంతో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పర్యావరణ హితంగా నిర్మించిన నూతన టెర్మినల్‌–2ను మోదీ ప్రారంభించారు.

దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరులోని క్రాంతివీరా సంగోలీ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి రాకపోకలు సాగిస్తుంది. వందేభారత్‌ రైలుతో మైసూరు–బెంగళూరు–చెన్నై అనుసంధానం మరింత మెరుగవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని మోదీ చెప్పారు.

ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకొనేవారి కోసం ‘భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌’ రైలును సైతం ప్రధానమంత్రి ప్రారంభించారు. ‘భారత్‌ గౌరవ్‌’ పథకంలో భాగంగా రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తాయి. ‘భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌’ రైలుతో కర్ణాటక, కాశీ సన్నిహితమవుతాయని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.      

నేటి సవాళ్లకు గాంధీజీ బోధనలే సమాధానం: మోదీ  
దిండిగల్‌: సంఘర్షణల నుంచి వాతావరణ సంక్షోభాల వరకూ.. నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు జాతిపిత మహాత్మా గాంధీ బోధనలే సమాధానాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా సాగడానికి మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. శుక్రవారం తమిళనాడులోని గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ 36వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌లో పట్టభద్రులైన నలుగురు విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు అందజేశారు.

మరిన్ని వార్తలు