World Environment Day: ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం

5 Jun, 2022 03:33 IST|Sakshi

వాతావరణ మార్పులు, తీవ్రమైన ఎండలు

సమస్యలతో భూగోళం సతమతం

చర్చలే తప్ప చర్యలు పట్టించుకోని దేశాలు

కాగితాలకే పరిమితమైన ‘పారిస్‌ ఒప్పందం’

భూగోళం వేడెక్కిపోతోంది. వాతావరణంలో కనీవినీ ఎరుగని విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న ఆదర్శం కాగితాలకే పరిమితమైంది. పారిస్‌ ఒప్పందాన్ని అమలు చెయ్యాలన్న పర్యావరణ శాస్త్రవేత్తల పిలుపులు కంఠశోషగానే మిగులుతున్నాయి. ఏడాదికోసారి పర్యావరణ పరిరక్షణ సదస్సులతో సరిపెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని, ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు...

జూన్‌ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాదితో దీనికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1972లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు స్వీడన్‌ ఆతిథ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులను గమనించి, అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అప్పుడు తొలిసారిగా గుర్తించారు. 1973 నుంచి జూన్‌ 5ను ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్‌ ఎర్త్‌’ థీమ్‌తో ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్‌ లైఫ్‌ స్టైల్‌ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రభుత్వాలేం చేయాలి?
► పర్యావరణ పరిరక్షణకు అతి ముఖ్యమైన అడవులు, నదులు, సముద్రాలు , తేమ ప్రాంతాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. 1990వ దశకంలో ఏడాదికి 1.6 కోట్ల హెక్టార్ల చొప్పున అడవులను కోల్పోయాం! 2015–2020 మధ్య కూడా ఏటా కోటి హెక్టార్ల చొప్పున తగ్గింది. అడవుల్ని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.
► ఐరాస ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ప్రకారం మాంసాహారం తయారీ, రవాణా వల్ల 18% దాకా కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పశు పెంపకానికి నీటి వాడకమూ పెరుగుతోంది. దీన్ని తగ్గించాలంటే వ్యవసాయ రంగంలో చిన్న కమతాల్ని ప్రోత్సహించాలి.
► ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య 2015–2019 మధ్య 21 నుంచి ఏకంగా 58 శాతానికి పెరిగింది. దీన్నింకా పెంచడానికి దేశాలన్నీ కృషి చేయాలి.
► ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి వల్ల 35 శాతం ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అందు కే గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించాలి. సోలార్, విండ్‌ పవర్, ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీలివ్వాలి.
► గ్లోబల్‌ వార్మింగ్‌కు 30 నుంచి 35 శాతం దాకా కారణమవుతున్న బ్లాక్‌ కార్బన్, మీథేన్, ఓజోన్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్‌ నియంత్రణకు గట్టి విధానాలు రూపొందించాలి.

పర్యావరణ పరిరక్షణకు పాటుపడకుంటే..
► ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీల దాకా పెరుగుతాయి. అప్పుడు జనాభాలో 14% అత్యంత తీవ్రమైన ఎండ వేడిమికి గురవుతారు. అది క్రమంగా 37 శాతానికి చేరే ప్రమాదముంది.
► 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మెగా నగరాల్లోని 35 కోట్ల మందిని ఎండ వేడి బాధిస్తుంది. నీటి కరువుతో, కాటకాలతో నగర ప్రాంతాలు అల్లాడిపోతాయి. దక్షిణాసియా దేశాలకే ఈ ముప్పు ఎక్కువ.
► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఢాకా, కరాచీ నగర వాసులు ఎండతీవ్రతకి  గురవుతారు.  
► సముద్ర మట్టాలు 24 నుంచి 38 సెంటీమీటర్లు పెరిగి బ్యాంకాక్,  జకార్తా,  మనీలా నగరాలు మునిగిపోవచ్చు.
► 2050 నాటికి సగం జనాభాకు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్‌ ముప్పుంటుంది. అస్తమా వంటి వ్యాధులు పెరిగిపోతాయి.
► కీటకాలు, మొక్కలు, జంతువుల ఆవాస ప్రాం తాలు సగానికి తగ్గి జీవ వైవిధ్యం నశిస్తుంది.

మనం చేయాల్సిందేమిటి?
► ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల బదులు రీ యూజబుల్‌ బ్యాగులు వాడాలి.
► కాగితం వాడకాన్ని తగ్గించాలి. అత్యవసరమైతే తప్ప ప్రింట్లు తీయొద్దు.
► వారానికి ఒక్క రోజన్నా శాకాహారమే తినాలి. వీగన్‌ డైట్‌ ద్వారా కర్బన్‌ ఉద్గారాలను 73 శాతం తగ్గించవచ్చు.
► కారు బదులు బైక్‌ వాడితే కిలోమీటర్‌కు 250 గ్రాముల కర్బన్‌ ఉద్గారాలను కట్టడి చయగలం.
► ఇంట్లో నీళ్ల పైపుల లీకేజీని ఎప్పటికప్పుడు సరి చేస్తే కోట్లాది గాలన్ల నీరు ఆదా అవుతుంది.
► ఇళ్లల్లో ఫ్లోరోసెంట్‌ బల్బులు వాడితే 75% కరెంటు ఆదా అవుతుంది.
► రీ యూజబుల్‌ కరోనా మాస్కులు వాడాలి. యూజ్‌ అండ్‌ త్రో మాస్కులతో జంతుజాలానికి ఎనలేని హాని జరుగుతోంది.
► డిటర్జెంట్స్, వాషింగ్, లిక్విడ్‌ సోపుల్లో కనిపించని ప్లాస్టిక్‌ కణాలుంటాయి. నేచరల్‌ ప్రొడక్టులు వాడటం మేలు.
► ఇంటా బయటా అందరూ పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు