సంబరంగా న్యూ ఇయర్‌ వేడుకలు

1 Jan, 2023 04:26 IST|Sakshi
ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద కొత్త ఏడాది సంబరాలు; పశ్చిమబెంగాల్‌లోని నదియాలో 2022 చివరి సూర్యాస్తమయానికి వీడ్కోలు

న్యూఢిల్లీ/మెల్‌బోర్న్‌: 2022కు గుడ్‌బై చెబుతూ, 2023కు స్వాగతం పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ ఆంక్షల బెడద తొలగిపోవడంతో ఎక్కడ చూసినా జనం పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వేడుకల్లో మునిగిపోయారు. పసిఫిక్‌ మహాసముద్రంలోని కిరిబాటి దీవులవాసులు అందరికంటే ముందుగా న్యూ ఇయర్‌కు ఆహ్వానం పలికారు.

వారు న్యూజిలాండ్‌ కంటే గంట ముందే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ స్కై టవర్‌ వద్ద అర్ధరాత్రికి 10 సెకన్ల ముందు నుంచి బాణసంచా వెలుగుల్లో ప్రజలు 2023కు స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. చైనాలోని గ్రేట్‌ వాల్‌ వద్ద, షాంఘైలోని డిస్నీల్యాండ్‌లో ప్రత్యేకంగా మతాబులు కాల్చారు. ఇక ఆస్ట్రేలియాలోని విఖ్యాత సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై, సమీపంలోని ఒపెరా హౌస్‌ వద్ద కన్నులు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేల్చారు.

రాష్ట్రపతి శుభాకాంక్షలు..: దేశ విదేశాల్లోని భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత, సమ్మిళిత అభివృద్ధి కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు