2022 ఆగస్ట్‌కు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన

24 Aug, 2020 10:03 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన  త్వరలో ప్రారంభం కాబోతోంది. చెనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన ఆగష్టు 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. రియాసి జిల్లాలోని కౌరి గ్రామంలో కత్రా-బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన చెనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది పారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన పొడవు 1.3 కిలోమీటర్లు. రిక్టర్ స్కేల్‌లో 7 కంటే ఎక్కువ కొలిచే భూకంపాన్ని తట్టుకోగలదు. ఇది కత్రా నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణ సమయాన్ని 5-6 గంటలు తగ్గిస్తుంది. (ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన!)

ఈ విషయంపై డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌ఆర్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ‘వంతెన నిర్మాణం పూర్తికి మాకు 2022 వరకు గడువు ఉంది. ఇది నిర్మించడం అంత తేలికైన పని కాదు. చాలా కష్టతరమైనది. అయితే వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందిన జియాసి జిల్లాలో అతి పెద్ద రైల్వే వంతెన ప్రాజెక్టు రావడంతో పర్యాటక రంగంలో మార్పు రాబోతుంది’ అన్నారు. ఈ వంతెనపై హెలిప్యాడ్‌ ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఛాపర్‌ ద్వారా రావొచ్చని తెలిపారు. ఇది స్థానిక ఉపాధిని, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుస్తుందన్నారు.(తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం)

కాగా ఈ రైల్వే వంతెన ప్రాజెక్టును కొంకణ్ రైల్వే నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం 2004 లో ప్రారంభమైంది. నిర్మాణంలో ఉన్న వంతెన 266 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదు. దాని కాల పరిమితి 120 సంవత్సరాలు ఉంటుంది. ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్‌–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్‌– క్వాజిగుండ్‌ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్‌–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్‌ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కశ్మీర్ రైల్వే ప్రాజెక్టులోని ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా విభాగంలో భాగమైన కత్రా, బనిహాల్ మధ్య ఉన్న ఈ వంతెన కీలకమైన లింక్.

మరిన్ని వార్తలు