Omicron Variant: సిరంజీలకు కొరత..!

12 Dec, 2021 04:52 IST|Sakshi

కరోనా రెండోవేవ్‌లో వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు హాహాకారాలు చేశాయి. టీకాలు పంపండి మహాప్రభో అంటూ కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఉత్పత్తి పెరిగి ఇప్పుడు సమృద్ధిగా టీకా డోసులు అందుబాటులోకి వచ్చేశాయని స్థిమిత పడుతుంటే మరో సమస్య వచ్చిపడింది. ఒమిక్రాన్‌ వేరియెంట్, జనవరి– ఫిబ్రవరి నెలల్లో థర్డ్‌వేవ్‌ పీక్స్‌కు చేరొచ్చనే వార్తలనేపథ్యంలో సిరంజీలకు తీవ్ర కొరత రానుంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.

ఏం జరిగింది? మూలిగే నక్కపై తాటిపండు
ప్రపంచంలోనే అతిపెద్ద సిరంజీ ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్‌ సిరంజీస్‌ అండ్‌ మెడికల్‌ డివైసెస్‌ (హెచ్‌ఎండీ) సంస్థకు హరియాణాలోని ఫరీదాబాద్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌–ఎస్‌సీఆర్‌ పరిధిలోకి వస్తుంది) శివార్లలో ఎనిమిది ఆటోమేటెడ్‌ ప్లాంట్లు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించట్లేదు కాబట్టి ఇందులో ప్రధాన ప్లాంట్‌తో సహా మూడింటిని మూసివేయాల్సిందిగా హరియాణా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశించింది. లేదంటే చట్టపరమైన చర్యలు చేపడతామని, ప్లాంట్లను సీల్‌ చేస్తామని హెచ్చరించింది. డీజిల్‌ జనరేటర్లతో ప్లాంట్లను నడుపుతున్నారని, ఇది కాలుష్యానికి కారణమవుతోందనేది పీసీబీ ఆక్షేపణ. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినపుడే తప్పితే తాము పెద్దగా డీజిల్‌ జనరేటర్లు ఉపయోగించట్లేదని పీసీబీకి వివరించినా... వారిని ఒప్పించలేకపోయామని హెచ్‌ఎండీ పేర్కొంది. దాంతో వీటిని హెచ్‌ఎండీ మూసివేసింది.  

భారత్‌ అవసరాల్లో మూడింట  రెండొంతులు హెచ్‌ఎండీయే తీరుస్తోంది.

ఏడాదికి హెచ్‌ఎండీ ఉత్పత్తి సామర్థ్యం. భారత్‌లో 20 పైచిలుకు సిరంజీ ఉత్పత్తి సంస్థలు ఉండగా... వీటి ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 50 కోట్లు. అంటే ఏడాదికి 600 కోట్లు. ఇందులో హెచ్‌ఎండీ ఒక్కటే 450 కోట్లు ఉత్పత్తి చేస్తోందంటే... దాంట్లో ఉత్పత్తి నిలిచిపోతే ఎదురయ్యే కొరతను అంచనా వేయవచ్చు.  

 ప్రతిరోజూ ఈ సంస్థ ఉత్పత్తి చేసే సిరంజీల సంఖ్య 1.2 కోట్ల పైచిలుకే 

మూడు ప్లాంట్ల మూసివేత కారణంగా రోజులు 80 లక్షల సిరంజీలు, 1.5 కోట్ల నీడిల్స్‌ ఉత్పత్తి నిలిచిపోతుందని హెచ్‌ఎండీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌నాథ్‌ తెలిపారు. ఈ లెక్కన కంపెనీ ఉత్పత్తిలో నెలకు 24 కోట్లు, ఏడాది 288 కోట్లు కోత పడుతుంది. దీంతో భారత్‌లో సిరంజీలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదముంది. ఫలితంగా కోవిడ్‌ వ్యాకినేషన్‌ కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగే ఆస్కారం ఉంది. 

 భారత్‌లో ప్రతి వ్యక్తికి సగటున ఏడాదికి 2.9 సిరంజీల వాడకం జరుగుతున్నట్లు 2018 లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం 350–400 కోట్ల సిరంజీలు
ఏడాదికి మన వినియోగానికి కావాలి. 

తమ గోదాముల్లో రెండురోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని, సోమవారం నుంచి దేశీయ అవసరాలకు సరఫరా చేసే స్టాక్‌లో భారీగా కోత పడుతుందని హెచ్‌ఎండీ తెలిపింది.  

ఎగుమతులపై నిషేధం
పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరు 9న సిరంజీల ఎగుమతులపై 3 నెలల నిషేధం విధించింది. 0.5 మిల్లీలీటర్లు, 1, 2, 3 ఎంఎల్‌ సిరంజీల ఎగుమతిని నిషేధించింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసు 0.5 ఎంఎల్‌ మాత్రమే. వృ«థాను అరికట్టాలంటే 0.5–1 ఎంఎల్‌ సిరంజీల వాడకం ఉత్తమం.  
143 కోట్లు: 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసిన సిరంజీల సంఖ్య. అమెరికా, చైనాలే ప్రపంచంలో రెండు అతిపెద్ద ఎగుమతుదారుల. ప్రపంచ సిరంజీల విపణిలో మన వాటా స్వల్పమే.  

తేడా ఏంటి? 
ఆటో డిజేబుల్‌ సిరంజీలను ఒకసారి ఉపయోగిస్తే... ఇందులోని సేఫ్టీ లాక్‌ బ్రేక్‌ అవుతుంది. సిరంజీలో వ్యాక్సిన్‌ను నింపాక సూది ఇవ్వడానికి పైనుంచి బొటనవేలితో నొక్కుతాం. రెండోసారి నొక్కేందుకు వీలులేని సిరంజీలు ఆటో డిసేబుల్‌లో మరోరకం. పునర్వినియోగానికి పనికిరావు. సంప్రదాయ డిస్పోజబుల్‌ సిరంజీలు అయితే... వాడిన వెంటనే నీడిల్‌ (సూది)ని కట్‌ చేసేసి నిర్దేశించిన చెత్తబుట్టలో పారవేయాలి. అలాకాకుండా మళ్లీ వినియోగిస్తే  ఇన్‌ఫెక్షన్లు ఒకరినుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (ఎన్‌డీఎంఏ) కింద సిరంజీలను అత్యావశ్యక వైద్య పరికరాలుగా ప్రకటించాలని (కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ దృష్ట్యా) కోరుతూ హెచ్‌ఎండీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. తమ ప్లాంట్లలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉత్పత్తి జరిగేలా చూడాలని కోరింది.   

మరిన్ని వార్తలు