ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్‌ పరిశోధన 

22 Feb, 2022 09:19 IST|Sakshi

‘‘సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా...’’ అన్నాడో కవి. సంతోషం సగం బలమే కాదు.. పూర్తి మనోబలం అంటున్నారు శాస్త్రవేత్తలు. పొద్దునలేస్తే వాట్సాప్‌లో ‘పాజిటివ్‌ థింకింగ్‌’కోట్స్‌... యూట్యూబ్, షేర్‌చాట్‌ అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ‘బీ పాజిటివ్‌’అంటూ వీడియోస్‌. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఈ పాజిటివ్‌ గోలేంట్రా!? అని అనుకోని వారుండరు. ‘ఎవరెన్నైనా అనుకోనివ్వండి ఆలోచన అనేది మానసికంగానే కాదు.. శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. ఆలోచన బాగుంటే చాలు... అంతా బాగుంటుంద’న్నది శాస్త్రవేత్తల మాట. అందులో నిజానిజాలేంటో నేడు ‘వరల్డ్‌ థింకింగ్‌ డే’ సందర్భంగా తెలుసుకుందాం. 

‘ఆశ... క్యాన్సర్‌ ఉన్నవాడినైనా బతికిస్తుంది. భయం.. అల్సర్‌ ఉన్నవాడినైనా చంపేస్తుంది’అని ఓ సినిమాలో డైలాగ్‌. అది నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. పెట్టుకునే ఆశ అయినా... పెంచుకునే భయం అయినా... ప్రభావితం చేసేది బ్రెయిన్‌. మనం ఏది చెప్తే అదే స్వీకరించే బ్రెయిన్‌.. శరీర భాగాలు అలాగే స్పందించేలా చేస్తుంది. ఏదైనా జబ్బుతో డాక్టర్‌ దగ్గరకు వెళ్తే.. ఆయన మిమ్మల్ని రిసీవ్‌ చేసుకున్న తీరు, ట్రీట్‌ చేసిన విధానం నచ్చకపోతే ఫలితం ఒకలా ఉంటుంది. చికిత్స ఇద్దరిదీ ఒకటే అయినా... డాక్టర్‌ రిసీవ్‌ చేసుకున్న విధానం, మీతో మాట్లాడిన తీరు, మీకిచ్చిన భరోసా బాగుంటే... అదే సగం జబ్బును తగ్గిస్తుంది. డాక్టర్‌ నుంచి వచ్చిన స్పందన, దాంతో వచ్చిన సంతృప్తి తాలూకు ఫలితం అది. ఇదే చాలా విషయాలకూ వర్తిస్తుందని సైంటిస్టులు అంటున్నారు.  

మరణం ముప్పు తగ్గుతుంది... 
సంతోషంగా సానుకూల దృక్పథంతో ఉంటే.. క్యాన్సర్‌ ముప్పును 16 శాతం తగ్గించుకోవచ్చు. హృద్రోగాలతో మరణించే రిస్క్‌ను 38 శాతం తగ్గించొచ్చు. శ్వాస సంబంధిత జబ్బుల మర ణాలనుంచీ 38% బయటపడొచ్చు. గుండెపోటుతో మరణించే రిస్క్‌ను 38% తగ్గించొచ్చు. ఇతర ఇన్ఫెక్షన్ల బారి నుంచి 52 శాతం తప్పించుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది. సానుకూల ఆలోచనకు సంతోషానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని హార్వర్డ్‌ బృందం తెలిపింది.  ఈ సానుకూల ధోరణి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్‌ స్థాయిలను పెంచుతుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇవన్నీ కలిపి.. వివిధ జబ్బుల రిస్క్‌ నుంచి కాపాడతాయి. 

అవుట్‌కమ్‌ మీద ఆలోచనల ప్రభావం... 
కీడెంచి మేలెంచాలని సామెత. ఎప్పుడూ మేలే ఎంచాలనేది పాజిటివ్‌ థింకింగ్‌ థియరీ. ‘ఏదైనా చేయగలననుకుంటే.. మెదడు అటువైపు నడిపిస్తుంది. చేయలేననుకుంటే.. నీరుగారుస్తుంది’ అని న్యూజిలాండ్‌ విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇదేమీ మ్యాజిక్‌కాదు... ఆలోచనలే ఆచరణమీద ప్రభా వం చూపి అవుట్‌కమ్‌ను ప్రభావితం చేస్తాయట. యవ్వనం, ఫిట్‌నెస్‌కూడా మైండ్‌ గేమే అంటున్నారు. అయితే ప్రతీదానికి పాజిటివ్‌ ఉండమంటూ... మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని దూరం చేస్తున్నారనే మరో వాదనా ఉంది.

ఎనిమిదేళ్ల ఆయుష్షు... 
ఆలోచనలు సానుకూల దృక్పథంతో ఉంటే... అంత ఎక్కువ కాలం బతుకుతారని ఓ అధ్య య నం తేల్చి చెప్పింది. ఆలోచనా విధానం బాగుంటే చావును ఎనిమిదేళ్లు వాయిదా వేయొచ్చట. ఆలోచనా దృక్పథం ఆయుష్షును ఎనిమిదేళ్లు పెంచుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అం దులోనూ మహిళల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తేల్చి చెప్పింది. అందుకే... రోగులకు మంచి ఆహారం తీసుకోమని, వ్యాయామం చేయమని చెప్పడమే కాదు.. వారిని సానుకూల ఆలోచనలను వైపు నడిపించా లని పరిశోధక బృందానికి నాయ కత్వం వహించిన డాక్టర్‌ ఎరిక్‌కిమ్‌ వైద్యులకు సూచిస్తున్నారు. వాటివల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. హార్వర్డ్‌ ఈ పరిశోధనను 70వేల మంది మహిళల మీదే జరిపినా... పురుషులకూ ఇదే వర్తిస్తుందని అంటున్నారు. వివిధ జబ్బులతో బాధపడుతున్న మహిళలను కొన్నేళ్లపాటు పరీక్షించగా.. సానుకూల దృక్పథంతో ఉన్నవారిలో మరణం ముప్పు 30% తగ్గిందట. 

మరిన్ని వార్తలు