కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు

23 Oct, 2020 09:35 IST|Sakshi

ప్రపంచానికి  మరో 20 ఏళ్లపాటు కరోనా టీకా అవసరం ఉంది

ఏ ఒక్క టీకాను నిలిపివేసిన చరిత్ర లేదు

భవిష్యత్తరాలకు టీకా ఉత్పత్తి అవసరం

సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి సుదీర్ఘ కాలంపాటు కోవిడ్-19 వాక్సీన్ల అవసరం ఉంటుదని పేర్కొన్నారు. జనాభాలో 100 శాతానికి  కరోనా టీకా ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, భవిష్యత్తులోమరో 20 ఏళ్లపాటు ఈ టీకాల అవసరం తప్పక ఉంటుందన్నారు.  టీకా ఒక్కటే పరిష్కారం కాదని అదార్  వివరించారు.

ఎందుకంటే ప్రపంచంలో  పలురకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో ఏ ఒక్క టీకాను నిలిపివేసిన చరిత్ర ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు వ్యాక్సిన్ ఖచ్చితమైన శాస్త్రం కాదు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, కానీ వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించదని పూనావాలా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నటీకాలు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయో ఎవరికీ తెలియదు. ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాలు. అయితే ఫ్లూ విషయానికి వస్తే ప్రతీ ఏడాది, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనావైరస్ విషయంలో కనీసం రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. 

కోవిడ్-9 వ్యాక్సిన్ కరోనాను ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలిస్తుంది, వైరల్ సంక్రమణను పూర్తిగా అరికడుతుంది లాంటి ఆశలు ఏమైనా ఉంటే ఈ కఠోర సత్యాన్ని మనం జీర్ణించుకోక తప్పదన్నారు. మీజిల్స్ వ్యాక్సిన్, అత్యంత శక్తివంతమైన టీకా, 95 శాతం వ్యాధి నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  కానీ  ప్రతీ ఏడాది కొత్తగా పుట్టిన శిశువులకు మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే కదా అని ఆయన ఉదాహరించారు. మొత్తం ప్రపంచంలో 100 శాతానికి టీకాలు అందించిన తరువాత కూడా భవిష్యత్తు కోసం కరోనా టీకా అవసరం ఉంటూనే ఉంటుదని పూనావల్లా వాదించారు. ఫ్లూ, న్యుమోనియా, మీజిల్స్, అంత ఎందుకు పోలియో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒక్కటి కూడా ఇంతవరకూ నిలిపివేయలేదని  తెలిపారు. 

మరిన్ని వార్తలు