ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ప్రారంభం.. విశేషాలివే

29 Oct, 2022 21:14 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌. ‘విశ్వాస్‌ స్వరూపం’గా పిలిచే ఈ విగ్రహం ప్రారంభోత్సవంలో సీఎంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారి బాబు, రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి పాల్గొన్నారు. రాజ్‌సమంద్‌ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో ‍అధునాతన హంగులతో 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు ‍అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 6వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

‘రామ కథలోని ప్రతి అంశం ప్రేమ, సామరస్యం, సోదరభావం గురించి చెబుతుంది. దేశంలో ప్రస్తుతం అదే అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అలాంటి కథలను చెప్పించాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు సీఎం అశోక్‌ గెహ్లోట్‌. ఆయనతో పాటు యోగా గురు రామ్‌దేవ్‌, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గలాబ్‌ చాంద్‌ కటారియా సహా ఇతర నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 

విగ్రహం విశేషాలు.. 
 
మహా శివుడి అతిపెద్ద విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో తత్‌ పదమ్‌ సంస్థాన్‌ అనే సంస్థ నిర్మించింది. 

► 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. ద్యానం చేస్తున్నట్లు ఉన్న కైలాశనాథుడు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తాడు.

► ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు 10 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకోసం 3,000 టన్నుల స్టీల్‌, ఐరన్‌ ఉపయోగంచారు. 2.5లక్షల క్యుబిక్‌ టన్నులు కాంక్రిట్‌, ఇసుకను వాడి పూర్తి రూపాన్నిచ్చారు. 

► ఈ శివుడి విగ్రహ నిర్మాణానికి 2012, ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌, మొరారి బాబుల సమక్షంలోనే శంకుస్థాపన చేశారు.  

► ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించాం. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇది కదా జాక్‌పాట్‌.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం

మరిన్ని వార్తలు