మళ్లీ రైతు కుటుంబంలో పుట్టను

5 Mar, 2022 06:16 IST|Sakshi

మహారాష్ట్ర రైతు వీడియో..ఆత్మహత్య  

ముంబై: దేశంలో రైతుల దుస్థితిని, దైన్యాన్ని కళ్లకు కట్టాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు. మరో జన్మంటూ ఉంటే రైతు కుటుంబంలో పుట్టబోనని, ఆవేదన వ్యక్తం చేస్తూ విషం తీసుకున్నాడు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రిలో కన్నుమూశాడు. షోలాపూర్‌ జిల్లా మగర్వాడీ గ్రామానికి చెందిన సూరజ్‌ జాధవ్‌(26)ది రైతు కుటుంబం. మూడు రోజుల క్రితం ఆయన ‘రైతులను గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతు కుటుంబంలో మళ్లీ పుట్టాలనుకోవడం లేదు’ అని అంటూ ఓ బాటిల్‌ మూత తీసి, అందులోని ద్రావకాన్ని తాగేశాడు.

ఈ మేరకు ఆయన తీసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం రేపింది. ఆయన శుక్రవారం పండర్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాధవ్‌ ఆల్కహాల్‌ కూడా తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. అతడి బలవన్మరణానికి రుణ భారం తదితర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొలానికి విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేయడం వల్లే అతడు చనిపోయి ఉంటాడంటూ వస్తున్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి కనెక్షన్లు కట్‌ చేయలేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు