Army Dog Zoom: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడినఇండియన్‌ ఆర్మీ శునకం మృతి

13 Oct, 2022 16:01 IST|Sakshi

శ్రీనగర్‌: శత్రువులకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన ఇండియన్‌ ఆర్మీ శునకం ‘జూమ్‌’ మృతి చెందింది. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూమ్‌ అనే జాగిలం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్‌ ఫీల్డ్‌ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ శునకం గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. ఉదయం 11:45 గంటల వరకు వైద్యానికి బాగానే సహకరించిందని, అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసి కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

కాగా సైన్యంలో కఠిన శిక్షణ పొందిన ‘జూమ్’.. కొన్ని సంవత్సరాలుగా ఇండియ‌న్ ఆర్మీ తరపున సేవలు అందిస్తుంది. అనేక సెర్చ్‌ ఆపరేషన్‌లలో పాల్గొంది. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన సెర్చ్ ఆప‌రేష‌న్‌లోనూ భాగం అయ్యింది. శ‌త్రువుల‌తో వీరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసింది. అసలేం జరిగిందంటే.. జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలోని టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా సైన్యం ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి జూమ్‌ అనే ఆర్మీ కుక్కను పంపారు. అది టెర్రరిస్టులను గుర్తించి వారిపై దాడి చేసింది. దీనిని గమనించిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు.

దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 'జూమ్' అనే ఆర్మీ కుక్కకు రెండు తుపాకీ బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడి నెత్తురు కారుతున్నా.. జూమ్ తన పోరాటాన్ని కొనసాగించింది.. దీని ఫలితంగా ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పలువురు జవాన్లు సైతం గాయపడ్డారు. సెర్చ్ ఆప‌రేష‌న్ ముగిసిన వెంట‌నే జూమ్‌ను ఇక్కడి ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ జూమ్‌ మరణించింది.
 

మరిన్ని వార్తలు