వీడియో: భారత్‌లో ఫస్ట్‌ టైం.. నది కింద నుంచి మెట్రో పరుగులు

12 Apr, 2023 21:06 IST|Sakshi

ఢిల్లీ: రైల్వే ప్రయాణంలో కోల్‌కతా(పశ్చిమ బెంగాల్‌) మెట్రో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది.  నది కింద భాగం నుంచి మెట్రో రైలు పరుగులు తీయడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ.  తద్వారా మన దేశంలోనే తొలిసారిగా ఇలాంటి అనుభూతిని ప్రయాణికులకు అందించబోతోంది. 

హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్‌ ప్రయాణం సాగనుంది. ఈస్ట్‌వెస్ట్‌ మెట్రో కారిడార్‌లో..  హౌరా మైదాన్‌ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్‌ అండర్‌ గ్రౌండ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్‌  ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. బుధవారం టెస్ట్‌ రన్‌ విజయవంతంగా పూర్తైంది.

ఈ ఫీట్‌ను మోడ్రన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. అయితే ట్రయల్‌ రన్స్‌ మొదలుపెట్టి ఏడునెలలపాటు కొనసాగిస్తామని.. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో రెగ్యులర్‌ ప్రయాణాలకు అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్‌ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్‌ కోల్‌కతా.

మరిన్ని వార్తలు