‘యముండా’ మాస్క్‌ లేకుంటే తాటతీస్తా

9 Apr, 2021 17:54 IST|Sakshi

మొరదాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్‌లు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. శానిటైజర్‌ వినియోగించండి అంటూ చెబుతూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో చేసిన అవగాహన దేశం దృష్టిని ఆకర్షించింది. యమధర్మరాజు వేషధారణలో గద.. పాశం ధరించి భీకర రూపంలో ఓ వ్యక్తి చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. 

‘భూలోకవాసుల్లారా మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి’ మొరదాబాద్‌ గల్లీలో నల్లటి వస్త్రాలు ధరించి కిరీటం, గదధారుడై ఓ స్థానిక కళాకారుడు యజధర్మరాజు రూపంలో వచ్చి కరోనా జాగ్రత్తలు వివరించాడు. కరోనా మళ్లీ విజృంభిస్తోంది.. జాగ్రత్తగా ఉండండి అని సూచించాడు. మాస్క్‌ ధరించకపోతే నేనొస్తా అంటూ పరోక్షంగా కరోనా సోకి మృతి చెందితే యమధర్మరాజుగా తానొస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తూ వెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లో తీవ్రస్థాయిలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చర్యలు చేపట్టారు. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 6,54,404 నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 8,474 కేసులు వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు