బెంగుళూరు అల్ల‌ర్ల‌పై సీఎం సీరియ‌స్

12 Aug, 2020 10:37 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి య‌డియూరప్ప సీరియ‌స్ అయ్యారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. శాంతియుత వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి అక్క‌డికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయ‌డం ఎంత మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని అన్నారు. ప‌రిస్థితిని చక్కదిద్దడానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని సీఎం తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ సంయ‌నం పాటించాలని ఆయ‌న కోరారు. ఇక ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు కావ‌డంతో ఆయ‌న అండతోనే  ఇలా చేస్తున్నాడని భావించి మంగ‌ళ‌వారం రాత్రి నిర‌స‌న‌కారులు ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. (బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం)

అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలు అయినట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలో సిటీలో 144 సెక్షన్‌ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 110 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్‌ కమిషనర్‌(క్రైం) సందీప్‌ పాటిల్‌ తెలిపారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా