Yes Bank DHFL Scam: ముంబై బిల్డర్స్‌కు చెందిన రూ.415 కోట్ల ఆస్తులు సీజ్‌!

3 Aug, 2022 15:03 IST|Sakshi

ముంబై: దేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హీట్‌ కొనసాగుతోంది. మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్రలోని ఓ బిల్డర్‌కు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ను సీజ్‌ చేసిన మరుసటి రోజునే మరిన్ని ఆస్తులను అటాచ్‌ చేసింది. ఆ బిల్డర్‌తో పాటు మరో వ్యక్తికి చెందిన మొత్తం రూ.415 కోట్లు విలువైన ఆస్తులను సీజ్‌ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఎస్‌ బ్యాంక్‌- డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బ్యాంకింగ్‌ కుంభకోణానికి సంబంధించి.. ఇప్పటికే రేడియస్‌ డెవెలపర్స్‌ అధినేత సంజయ్‌ ఛాబ్రియా, ఏబీఐఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ చీఫ్‌ అవినాశ్‌ భోంస్లేలను అరెస్ట్‌ చేసింది ఈడీ. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు రూ.34వేల కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

గతవారం అవినాశ్‌ భోంస్లేకు చెందిన హెలికాప్టర్‌ను పుణెలో స్వాధీనం చేసుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. తాజాగా బుధవారం సీజ్‌ చేసిన ఆస్తుల్లో.. ముంబైలోని రూ.116.5 కోట్లు విలువైన ఆస్తి, ఛాబ్రియా సంస్థలో 25 శాతం ఈక్విటీ షేర్లు, రూ.3 కోట్లు విలువైన ఫ్లాట్‌, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్‌లో లాభం రూ.13.67 కోట్లు, రూ.3.10 కోట్లు విలువైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. మరోవైపు.. అవినాశ్‌ భోంస్లే ఆస్తుల్లో ముంబైలోని రూ.102.8 కోట్లు విలువైన డూప్లెక్స్ ఫ్లాట్‌, పుణెలోని రూ.14.65 కోట్లు, రూ.29.24 కోట్లు విలువైన భూములు, నాగ్‌పూర్‌లోని రూ.15.62 కోట్లు విలువైన మరో ల్యాండ్‌ వంటివి సీజ్‌  చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 

ఇదీ కేసు.. 
పీఎంఎల్‌ఏ చట్టం 2002 ప్రకారం ఇరువురికి అటాచ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది ఈడీ. తాజాగా సీజ్‌ చేసిన ఆస్తులతో మొత్తం ఇద్దరికి సంబంధించి రూ.1,827 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 1988లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఎస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్స్‌ కపిల్ వాధ్వాన్, ధీరజ్‌ వాధ్వాన్‌లను విచారిస్తోంది ఈడీ. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఎస్‌ బ్యాంక్‌ నుంచి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిహెచ్‌ఎఫ్‌ఎల్‌లోని స్వల్ప కాలిక నాన్ కన్వెర్టబుల్‌ డిబెంచర్స్‌లో రూ.3,700 కోట్లు ఎస్‌ బ్యాంక్‌ పెట్టుబడి పెట్టినట్లు ఈడీ పేర్కొంది. అలాగే.. మసాలా బాండ్స్‌లో రూ.283 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. దానికి బధులుగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా కపిల్‌ వాద్వాన్‌.. రాణా కపూర్‌ సంస్థలకు రూ.600 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టగా సంజయ్‌ ఛాబ్రియాన్‌ చెందిన రేడియస్‌ గ్రూప్‌నకు రూ.2,317 కోట్లు రుణాలు వచ్చాయని... వాటిని అవినాశ్‌ భోంస్లేతో కలిసి ఇతర మార్గాల్లోకి మళ్లించాడని పేర్కొంది.

ఇదీ చదవండిఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు

మరిన్ని వార్తలు