కరోనా కాలంలో యోగా ఆశాకిరణం!

22 Jun, 2021 05:23 IST|Sakshi
లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ ట్సో సరస్సు వద్ద యోగా చేస్తున్న ఇండో–టిబెటన్‌ సరిహద్దు పోలీసులు

ప్రధాని నరేంద్ర మోదీ

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు కావాల్సిన బలాన్నివ్వడంలో యోగా ఎంతో సాయం చేసిందని, ఈ కష్టకాలంలో యోగా ఒక ఆశాకిరణంలా కనిపించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. సోమవారం ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు యోగా ఆచరించడం ద్వారా అంతర్జాతీయ యోగాడేను నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ సహకారంతో రూపొందించిన ఎం– యోగా యాప్‌ను ప్రధాని ఆవిష్కరించారు.

ఈ యాప్‌లో పలు భాషల్లో యోగా ట్రైనింగ్‌ వీడియోలు అందుబాటులో ఉంటాయి. పాత సాంప్రదాయం, ఆధునిక టెక్నాలజీ మేళవింపునకు ఈ యాప్‌ నిదర్శనమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘వన్‌ వరల్డ్, వన్‌ హెల్త్‌’ సాకారమయ్యేందుకు ఈ యాప్‌ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదిన్నరలో లక్షల మంది కొత్తగా యోగా నేర్చుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమస్యలెన్ని ఉన్నా, పరిష్కారాలు మనలోనే ఉంటాయనేందుకు యోగా ఉదాహరణ అని కొనియాడారు. ఈ ఏడాది యోగా డే థీమ్‌గా ‘యోగా ఫర్‌ వెల్‌నెస్‌’ను ఎంచుకున్నారు. ప్రతి దేశం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.  

భారత్‌ అందించిన బహుమతి
ప్రపంచానికి భారత్‌ అందించిన అద్భుత బహుమతి యోగా అని రాష్ట్రపతి కోవింద్‌ కొనియాడారు. కరోనా సమయంలో యోగా మరింత సహాయకారని యోగా డే సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయ సంస్థలు యోగా ఈవెంట్లు నిర్వహించాయి. ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద దాదాపు 3వేల మంది జతకూడి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా యోగాను మరింతమందికి చేరువచేయాలని భావించినట్లు ఇండియా కౌన్సిల్‌జనరల్‌ రణధీర్‌ చెప్పారు.

ఖట్మండూలో ఇండియన్‌ ఎంబసీ ‘ఆజాదీకాఅమృత్‌ మహోత్సవ్‌’ పేరిట నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా యోగాపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించింది. కోయంబత్తూర్‌లో పీపీఈ సూట్లు ధరించిన కొందరు కోవిడ్‌ పేషంట్లు యోగాసనాలు వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. లడఖ్‌లో ఐటీబీపీ జవాను ఒకరు మంచులో సూర్యనమస్కారాలు నిర్వహించారు. 2014లో జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ఐరాస ప్రకటించింది.  

మరిన్ని వార్తలు