ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది : యోగి

5 Aug, 2020 13:46 IST|Sakshi

అయోధ్య : దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేద మంత్రోచ్ఛరణల నడుమ శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమి పూజకు నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ప్రవిత్ర నదీ జలాలతో క్రతువు నిర్వహించారు. అయోధ్యలో భూమిపూజకు సమాంతరంగా.. దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రార్థనలు, పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్, నిత్య గోపాల్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. (లైవ్‌ అప్‌డేట్స్‌; అయోధ్యలో భూమిపూజ)

ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..'ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది. రామమందిరం భూమి పూజలో పాల్గొనడం మా అదృష్టం. ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కల సాకారమైంది. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుంది. ఎందరో త్యాగాల ఫలితమిది' అంటూ చెప్పుకొచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దశాబ్ధాల కల నెరవేరిన ఆనందం కనిపిస్తోంది. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. అందరూ ఈ వేదికపై లేకపోవచ్చు.. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిది.  రామమందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ద్వేషాలు, పాపాల నుంచి దూరంగా.. సర్వమానవ సమాజం కోసం తమకు తాము తయారుచేసుకోవాలి. విశ్వమానవాళికి మార్గదర్శం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రూపుదిద్దుకోబోతుంది' అంటూ మోహన్ భగవత్ వెల్లడించారు.(అద్వాని హాజ‌రు కాక‌పోవ‌డంపై యోగి ఏమ‌న్నారంటే?)

మరిన్ని వార్తలు