Dinesh Katheek Resignation: యూపీ సర్కార్‌కు బిగ్‌ షాక్‌.. ఏకంగా మంత్రి రాజీనామా

20 Jul, 2022 19:11 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌కు భారీ షాక్‌ తగిలింది. ఏకంగా కేబినెట్‌ మంత్రి దినేష్‌ ఖతిక్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు పంపించారు. కాగా ఖతిక్‌ యూపీ నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల సీఎం తనను అవమానిస్తున్నారని, గత 100 రోజుల నుంచి తనకు పనులు అప్పజెప్పడం లేదని దినేష్‌ ఖతిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తన శాఖపరమైన బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎంతో బాధను అనుభవించే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

‘నేను దళితుడు అవ్వడం వల్ల పక్కకు పెట్టారు. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మంత్రిగా నాకు అధికారాలు లేవు. రాష్ట్ర మంత్రిగా పనిచేయడం వల్ల దళిత వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు. నన్ను ఏ సమావేశానికి పిలవరు. నా మంత్రిత్వశాఖ గురించి ఏం చెప్పరు. ఇది దళిత సమాజాన్ని అవమానించడమే’నని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే పార్టీ నేతలు ఖతిక్‌తో మాట్లాడి, బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
చదవండి: తెలంగాణలో ధాన్యం కొనుగోలు.. కేసీఆర్‌ సర్కార్‌పై కేంద్రమంత్రి ఫైర్‌

దీనికి తోడు మరోమంత్రి జితిన్‌ ప్రసాద సైతం సీఎం యోగిపై ఆగ్రహంతో ఉన్నట్లు, అతను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీలోని బీజేపీ అధిష్టానంతో భేటీ అయ్యారు. కాగా ప్రసాద పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. పలువురు అధికారులు బదిలీల కోసం లంచం తీసుకున్నట్లు తేలడంతో ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. డిపార్ట్‌మెంటల్ బదిలీల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన ఐదుగురు సీనియర్ పీడబ్ల్యూడీ అధికారులను మంగళవారం యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఈ క్రమంలో యూపీ ప్రభుత్వంపై ప్రసాద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యూపీ ఎన్నికలకు నెలరోజుల ముందే ప్రసాద కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వాల్లో అసంతృప్తి బయటపడటం చాలా అరుదు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రే రాజీనామా చేయడంతో కాషాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగ రాజుకోవడంతో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగికి పెద్ద ఎద్దురుదెబ్బ తగిలినట్లైంది. 
చదవండి: గో ఫస్ట్‌ విమానానికి తప్పిన పెనుముప్పు.. రెండు రోజుల్లో మూడోసారి

మరిన్ని వార్తలు