త్వరలో యోగి కేబినెట్‌ విస్తరణ..?

21 Aug, 2021 01:08 IST|Sakshi

మిషన్‌–2022 రోడ్‌మ్యాప్‌పై కమలదళం కీలక భేటీ    

అమిత్‌ షా, నడ్డాలతో యూపీ సీఎం యోగి చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల ముందు, సెమీ ఫైనల్‌గా భావించే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని నిలబెట్టుకొనేందుకు కమలదళం కసరత్తు కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయడంలో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌ 10, 11 తేదీల్లో ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ వ్యవహారాలకు సంబంధించి గురువారం రాత్రి సుమారు మూడున్నర గంటల పాటు హోంమంత్రి అమిత్‌ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్, సునీల్‌ బన్సాల్‌లతో పాటు పార్టీ హైకమాండ్‌ పిలుపుతో సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్, సంజయ్‌ నిషాద్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కీలక భేటీలో మిషన్‌–2022కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌తో పాటు, ఖాళీగా ఉన్న నాలుగు సీట్లను భర్తీ చేసేందుకు ప్రతిపాదిత పేర్ల జాబితాను హైకమాండ్‌కు అందజేశారు. సమావేశంలో పేర్లు ఖరారు చేశారు. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్తను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

త్వరలో కేబినెట్‌ విస్తరణ? 
మరోవైపు పార్టీ హైకమాండ్‌తో జరిగిన మారథాన్‌ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొనడం కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై మరోసారి ఊహాగానాలకు తెరలేపింది. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో సుమారు ఆరుగురికి మంత్రులుగా అవకాశాన్ని కల్పించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో యువకులు, మహిళలకు పెద్దపీట వేయనున్నారు.

అక్టోబర్‌ నుంచి ప్రధాని పర్యటనలు.. 
కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించి దాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగించేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ముందుకు సాగుతోంది. పార్టీ క్యాడర్‌ని సమీకరించేందుకు ఎన్నికల బూత్‌ స్థాయి కార్యకర్తల కోసం పన్నా ప్రముఖ్‌ సమ్మేళనాన్ని వచ్చే నెల చివరి వారంలో బీజీపీ చేపట్టనుంది. అక్టోబర్‌ నుంచి నెలకోసరి అయినా ప్రధాని మోదీ యూపీ వస్తారని బీజేపీ నాయకుడు తెలిపారు.

ఎజెండాపై చర్చ – యోగికి దిశానిర్దేశం 
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ వ్యవహారంలో పార్టీ ఎన్నికల మూడ్‌లో ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, జాతీయత అంశాలను ఎజెండాతో రాబోయే ఎన్నికల కోసం ఎలా ముందుకు వెళ్లాల నే దానిపై కూడా ఒక వ్యూహం రూపొందించారని సమాచారం. ఎన్నికలకు ముందు అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి సంబంధించిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఒక యాత్రను చేపట్టేందుకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేయమని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ హైకమాండ్‌ కోరిందని బీజేపీ కీలక నేత ఒకరు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో సాధారణంగా జరిగే కుల సమీకరణాలను పరిష్కరించేందుకు కమలదళం ఒక ప్రణాళికను సైతం సిద్ధం చేసిందని సమాచారం.  అంతేగాక ఓబీసీలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు, ఇతర వెనుకబడిన వర్గాలు, తరగతుల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్ళాలని యోగి ఆదిత్యనాథ్‌కు హైకమాండ్‌ దిశానిర్దేశం చేసిందని తెలిసింది. 

మరిన్ని వార్తలు